పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భూమి మీద జీవకోటి మనుగడ సాగించాలంటే అడవుల పాత్ర ఎంతో. అంతటి కీలకమైన అడవుల రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలంటే నిష్ణాతులైన అధికారుల అవసరం చాలా ఉంది. అలాంటి నిబద్ధత గల అధికారులను దేశానికందించే ఉద్దేశంతో యూపీఎస్సీ ప్రతి ఏటా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాదికిగానూ నోటిఫికేషన్ విడుదలైన
నేపథ్యంలో పరీక్ష తీరుతెన్నులపై విశ్లేషణ...
మొత్తం పోస్టులు: 85
అర్హత: యానిమల్ హజ్బెండ్రీ అండ్ వెటర్నరీ సైన్స్/బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్ /జువాలజీ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా అగ్రికల్చర్/ఫారెస్ట్రీ/ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి: ఆగస్టు1, 2012 నాటికి 21-30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు సడలింపు.
అటెంప్ట్స్: జనరల్ కేటగిరీ అభ్యర్థులు మొత్తం నాలుగు సార్లు, ఓబీసీలు ఏడుసార్లు మాత్రమే రాసే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 14, 2012
పరీక్ష తేదీ: జూలై 14, 2012
మనరాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
రాత పరీక్ష విధానం:
పరీక్షలో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. అవి..
1. జనరల్ ఇంగ్లిష్ - 300 మార్కులు
2. జనరల్ నాలెడ్‌జ - 300 మార్కులు
3. అభ్యర్థి ఎంచుకున్న రెండు ఆప్షనల్స్ సబ్జెక్టులలో ఒక్కో ఆప్షనల్ సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి.
ఒక్కో పేపర్‌కు 200 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు 800 మార్కులు. ప్రతి ప్రశ్నపత్రం పార్ట్-ఏ, పార్ట్-బీ అని రెండు విధాలుగా ఉంటుంది. ప్రతి పార్ట్‌లో నాలుగు ప్రశ్నల చొప్పున ఉంటాయి. వీటిలో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి పార్ట్‌లో తప్పనిసరిగా ఒక ప్రశ్నకైనా సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటాయి. వీటికి సమాధానాలు కూడా ఇంగ్లిష్ మాధ్యమంలోనే రాయాలి. అన్ని పేపర్లు కన్వెన్షనల్ (వ్యాసరూప) విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్ పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
ప్రశ్నపత్రం స్థాయి: జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్‌జ, ఇంజనీరింగ్ సబ్జెక్టులకు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనూ, మిగతా సబ్జెక్టులకు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి కంటే పైన, మాస్టర్స్ డిగ్రీ స్థాయి కంటే తక్కువలోనూ సిలబస్ ఉంటుంది.
పర్సనాలిటీ టెస్ట్: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి 300 మార్కులు ఉంటాయి.
అభ్యర్థి ఎంచుకోవాల్సిన ఆప్షనల్ సబ్జెక్టులు:
అగ్రికల్చర్; అగ్రికల్చరల్ ఇంజనీరింగ్; యానిమల్ హజ్బెండ్రీ అండ్ వెటర్నరీ సైన్స్; బోటనీ; కెమిస్ట్రీ; కెమికల్ ఇంజనీరింగ్; సివిల్ ఇంజనీరింగ్; ఫారెస్ట్రీ; జియాలజీ; మ్యాథమెటిక్స్; మెకానికల్ ఇంజనీరింగ్; ఫిజిక్స్; స్టాటిస్టిక్స్; జువాలజీ
అనుమతించని కాంబినేషన్లు:
కొన్ని సబ్జెక్టుల కాంబినేషన్‌ను అనుమతించరు. అవి..
అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్; అగ్రికల్చర్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ అండ్ వెటర్నరీ సైన్స్; అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ; కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్; మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. అదే విధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులలో ఒకదాన్ని మించి ఎంచుకోవడానికి కుదరదు.
వెబ్‌సైట్: www.upsconline.nic.in
జనరల్ నాలెడ్జ్: ఈ విభాగం నుంచి తక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి పరీక్ష తేదీకి సరిగ్గా ఏడాది ముందు వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పలు ప్రధాన సంఘటనలు తెలుసుకోవాలి. భారత్‌కు వివిధ దేశాలతో ఈ ఏడాది కాలంలో జరిగిన ఒప్పందాలు; సదస్సులు, సమావేశాలు, అవార్డులు, సత్కారాలు, క్రీడలు-విజేతలు, పుస్తకాలు-రచయితలు మొదలైనవాటిని అధ్యయనం చేస్తే కరెంట్ అఫైర్‌స ప్రశ్నలకు సమాధానాలు రాయడం సులువే.
జాగ్రఫీ: ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12 తరగతుల జాగ్రఫీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఈ విభాగంలో మ్యాప్ పాయింట్ ప్రశ్నలడుగుతున్నారు. జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వివిధరకాల అటవీప్రాంతాలకు సంబంధించిన ప్రదేశాల మ్యాప్ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి.
హిస్టరీ: ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12 తరగతుల హిస్టరీ పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. ఇందులో ప్రాచీన, మధ్యయుగ భారత దేశ చరిత్రకు ప్రాధాన్యం ఉంది. చదువుతున్నప్పుడే ముఖ్య పట్టణాలు, రాజులు-పాలనా కాలం-కీలక ఘట్టాలు, రాజ శాసనాలు-ఆ రాజు బిరుదులు-ఆస్థానంలో కవులు-రచనలు, ఆ సమయంలో సందర్శించిన ప్రముఖులు... ఇలా అన్ని అంశాలూ పాయింట్లుగా రాసుకుంటే ఎంతో ప్రయోజనం.
పాలిటీ: ఎన్‌సీఈఆర్‌టీ 8 నుంచి 12 తరగతుల పాఠ్య పుస్తకాలతోపాటు ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ పుస్తకం ఉపయోగపడతాయి.
ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం సరిపోతుంది.
ఆప్షనల్స్‌పై ఎక్కువ దృష్టి..
మీ దగ్గరున్న పాఠ్యపుస్తకం మొత్తం చదవడం కంటే సిలబస్ ప్రకారం చదవాలి. నోటిఫికేషన్‌లో చాప్టర్లవారీగా ఇచ్చిన సిలబస్ ప్రకారం.. ఏ చాప్టర్‌లో ఏఏ అంశాలు ఉన్నాయో వాటినే బాగా చదవాలి. చదివే సమయంలోనే ముఖ్యాంశాలను పాయింట్లుగా రాసుకోవాలి. ఆప్షనల్ సిలబస్ బ్యాచిలర్ డిగ్రీ స్థాయికి కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంబంధిత అంశాల మేరకు పీజీ లేదా రిఫరెన్స్ పుస్తకాలు కూడా చదవాలి.
జీకే, ఇంగ్లిష్‌లతో పాటు అభ్యర్థులు తమ ఆప్షనల్‌కు సంబంధించి పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. ప్రశ్నల శైలి, క్లిష్టత స్థాయి తెలుసుకోవాలి. ఇన్‌స్టంట్ మెటీరియల్ (గైడ్ల) కు బదులు అకడమిక్ పుస్తకాలు ఆప్షనల్ ప్రిపరేషన్‌కు బాగుంటాయి. అవసరం అనుకుంటే ఆ సబ్జెక్ట్‌లో రిఫరెన్స్ పుస్తకాలు తిరగేయాలి. ఆప్షనల్ సబ్జెక్టులు చదువుతున్నప్పుడే రాయడాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. చదవడానికి కేటాయించే మొత్తం సమయంలో 60 శాతం ఆప్షనల్స్‌కు మిగిలిన 40 శాతం పేపర్-1, పేపర్-2లకు కేటాయించుకోవాలి. పరీక్షకు 5, 6 నెలల ముందు నుంచే పరీక్షకు సిద్ధం కావాలి.
స్కోరింగ్‌లో ఆప్షనల్ సబ్జెక్టులు కీలకపాత్ర పోషిస్తాయి. బ్యాచిలర్ డిగ్రీలో చదివిన సబ్జెక్టులనే పరీక్షలో ఎంచుకోవాలని చాలామంది అభ్యర్థులు అపోహపడుతుంటారు.అది సరికాదు. యూపీఎస్సీ పేర్కొన్న ఆప్షనల్స్‌లో ఏవైనా రెండు ఎంచుకుని పరీక్ష రాయొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ ఆప్షనల్స్‌ను మంచి స్కోరింగ్ సబ్జెక్టులుగా పరిగణించొచ్చు.
ఇంటర్వ్యూ:
మౌఖిక పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఇందులో విజయం సాధించాలంటే ఇంటర్వ్యూ నాటికి రెండు, మూడు నెలల ముందు జరిగిన ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. అదేవిధంగా మనరాష్ట్రంలో అడవులు, వాతావరణ మార్పులు, పర్యావరణ అంశాలు, అభ్యర్థి హాబీలు, బయోడైవర్సిటీ, ఇంతకు ముందు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే దానికి సంబంధించి వివరాలు అడిగే అవకాశం ఉంటుంది. అడవులకు సంబంధించిన విషయాల కోసం ఎవరైనా అటవీ అధికారిని కలిసి వివరాలు సేకరించడం లాభిస్తుంది.
No comments:
Post a Comment