డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వృత్తిని చేపట్టే ప్రతి అభ్యర్థి సంబంధిత అకాడెమిక్ అర్హతలతోపాటు.. నిర్దేశించిన ఎలిజిబిలిటీ పరీక్షల్లో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్), దాని తరహాలోనే కొన్ని రాష్ట్రాలు సొంతంగా స్లెట్(స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలను నిర్వహిస్తున్నాయి.
గత కొంత కాలంగా స్లెట్ నిర్వహించకపోడంతో.. రాష్ట్ర విద్యార్థులకు లెక్చర్‌షిప్ సాధించేందుకు మిగిలిన ఏకైక అవకాశం.. యూజీసీ-నెట్. ఇంగ్లిష్ మీడియంలో ఉండడం.. సిలబస్ విస్తృతి, తదితర కారణాలతో మన తెలుగు విద్యార్థులకు నెట్ కష్టంగా ఉంటుందనే భావన నెలకొని ఉంది. దాంతో రాష్ట్ర విద్యార్థులు అనేక విలువైన అవకాశాలను కొల్పోతున్నారు.
నిరుద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తుండడంతో.. తిరిగి స్లెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో స్లెట్ పేరిట నిర్వహించిన ఈ పరీక్షను ప్రస్తుతం ఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్)గా వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు 13 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఎలిజిబిలిటీ టెస్ట్‌కు రంగం సిద్ధమైంది.
ఓయూకు బాధ్యతలు:
చాలా కాలం తర్వాత జరుగుతున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కి దక్కాయి. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏపీసెట్-2012 నిర్వహణ కోసం ఓయూను స్టేట్ ఏజెన్సీగా గుర్తించింది. సంబంధిత నోటిఫికేషన్‌ను యూనివర్సిటీ గత నెల 23న విడుదల చేసింది.
24 సబ్జెక్టులు.. తెలుగులోనూ పరీక్ష:
యూజీసీ-నెట్/సీఎస్‌ఐఆర్-నెట్ నిర్వహణ కోసం పాటించే ప్రమాణాల ఆధారంగానే ఏపీసెట్ జరుగుతుంది. పరీక్ష నిర్వహణ, సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, నాణ్యత ప్రమాణాలు, ప్రశ్నాపత్రాల రూపకల్పన వంటి అంశాలన్నీ పూర్తిగా యూజీసీ-నెట్ మాదిరిగానే ఉంటాయి. ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో కలిపి మొత్తం 24 సబ్జెక్టులలో ఏపీసెట్‌ను నిర్వహిస్తున్నారు. కొన్ని సబ్జెక్ట్‌లను ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలో, మరికొన్నిటిని కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే రాయాలి. ఎటువంటి వయోపరిమితి లేదు. ఎన్నిసార్లు అయినా ఏపీసెట్‌కు హాజరు కావచ్చు.
ఎగ్జామినేషన్ స్కీమ్:
ఏపీసెట్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పేపర్లు.. పేపర్-1,2,3గా ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. మూడు పేపర్లకు కూడా ఒకే రోజు పరీక్ష ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. పేపర్-1 ద్వారా టీచింగ్ ఆప్టిట్యూడ్‌ను పేపర్-2,3 ద్వారా సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షిస్తారు.
పేపర్-1: అందరికీ కామన్‌గా ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో కనీసం 50 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు: 100. సమయం: గంట 15 నిమిషాలు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు మాధ్యమంలో కూడా ప్రశ్నపత్రం ఉంటుంది. బోధన/పరిశోధనల పట్ల అభ్యర్థి అభిరుచిని అంచనా వేసేందుకు ఉద్దేశించింది ఈ పేపర్.
ఇందులో తార్కిక సామర్థ్యం, విశ్లేషణ శక్తి, ఆలోచన విధానం,గ్రహణ శక్తి వంటి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులోని మొత్తం 60 ప్రశ్నల్లో.. 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన పక్షంలో.. అభ్యర్థి సమాధానాలను గుర్తించిన మొదటి 50 ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు.
పేపర్-2: మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు: 100. సమయం: గంట 15 నిమిషాలు. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌లో పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఈ పేపర్‌ను రూపొందించారు. నిర్దేశించిన కొన్ని సబ్జెక్టులకు తెలుగు, ఇంగ్లిష్ రెండు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
పేపర్-3: మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు: 150. సమయం: రెండున్నర గంటలు. ఎంచుకున్న సబ్జెక్ట్‌పై అభ్యర్థి లోతైన అవగాహనను పరీక్షించడం.. ఆ సబ్జెక్ట్‌లోని స్పెషలైజేషన్స్ కవర్ అయ్యే విధంగా ప్రశ్నలు వస్తాయి. నిర్దేశించిన కొన్ని సబ్జెక్టులకు తెలుగు, ఇంగ్లిష్ రెండు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
సిలబస్ ఒకటే: జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ-నెట్, యూజీసీ-సీఎస్‌ఐఆర్-నెట్ పరీక్షల కోసం పేర్కొన్న సిలబస్‌నే..ఏపీసెట్ కోసం అనుసరిస్తున్నారు. పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు ఓఎంఆర్ కార్బన్ ప్రింట్ అవుట్లను తమ వెంట తీసుకెళ్లొచ్చు.
అర్హత మార్కులు: మూడు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి.. పేపర్లు, కేటగిరీల వారీగా వేర్వేరు అర్హత మార్కులను నిర్ణయించారు. ప్రతి పేపర్‌లో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన వారిని మాత్రమే ఫైనల్ రిజల్ట్స్ ప్రిపరేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు నిర్దేశించిన అర్హత మార్కులు సాధించినప్పటికీ మోడరేషన్ కమిటీ నిర్ధారించే కటాఫ్ మార్కుల ఆధారంగా లెక్చరర్‌షిప్‌ను ప్రదానం చేస్తారు.
అర్హత మార్కులు
కేటగిరీ పేపర్-1 పేపర్-2 పేపర్-3
జనరల్ 40 40 75
బీసీ 35 35 67.5
పీహెచ్/వీహెచ్/
ఎస్సీ/ఎస్టీ 35 35 60
ఏపీసెట్-2012 సమాచారం:
అర్హత: 55 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/వీహెచ్ అభ్యర్థులకు 50 శాతం) సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌గ్రాడ్యుయేషన్. నిబంధనలకనుగుణంగా చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్-రూ.700, బీసీ- రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/వీహెచ్-రూ.250. ఫీజును చలాన్ రూపంలో చెల్లించాలి. సంబంధిత చలానాను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ సెంటర్లు: హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి,గుంటూరు, అనంతపురం, కడప, కర్నూలు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ప్రింట్ అవుట్ తీసుకున్న దరఖాస్తుతోపాటు, బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నోటిఫికేషన్‌లో నిర్దేశించిన చిరునామాకు తప్పనిసరిగా పంపాలి.
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: మే 3, 2012.
ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు: మే 30, 2012.
అపరాధ రుసుం రూ.100తో దరఖాస్తు:
జూన్ 1 నుంచి 5 తేదీ వరకు
అపరాధ రుసుం రూ.200తో దరఖాస్తు:
జూన్ 6 నుంచి 10 తేదీ వరకు.
ప్రింట్ అవుట్ హార్డ్ కాపీ(సంబంధిత సర్టిఫికెట్లతో కలిపి) స్వీకరణ కు చివరి తేదీ: జూన్ 13, 2012.
పరీక్ష తేదీ: జూలై 27, 2012.
వెబ్‌సైట్: www.apset.org
........................
ఆగస్టు 16లోగా సెట్ ఫలితాలు
సెట్ నిర్వహణకు సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు రెండు సెట్ల చొప్పున ప్రశ్న పత్రాల రూపకల్పనకు కసరత్తు ప్రారంభించాం. దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన సుమారు వేయి మంది ప్రొఫెసర్లు ఈ ప్రక్రియలో పాల్పంచుకోనున్నారు. ప్రశ్న పత్రాల స్థాయి యూజీసీ నెట్ తరహాలోనే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గట్టిగా శ్రమించాల్సిందే.
సెట్ పరీక్షకు సంబంధించి మోడల్ ప్రశ్న పత్రాలను ప్రత్యేకంగా విడుదల చేసే ఆలోచనలేదు. అభ్యర్థులు యూజీసీ నెట్ పరీక్ష పత్రాన్ని ఫాలో అవ్వాల్సిందే. ప్రశ్న పత్రాలు తెలుగులో ఉండడం మాత్రమే కొంచెం కలిసొచ్చే విషయం. సబ్జెక్టులో ఉన్నతస్థాయి ప్రిపరేషన్ చేయాలనేదే అభ్యర్థులకు నా సలహా. సెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కో రీజియన్‌లో నాలుగు చొప్పున మొత్తం 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నాం.
చాలా సంవత్సరాల తర్వాత సెట్ నిర్వహిస్తున్నందున 50 వేల నుంచి 60 వేల వరకు దరఖాస్తులు రావొచ్చని అంచనా. ముఖ్యంగా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, తెలుగు, ఇంగ్లీషు, కామర్స్ తదితర సబ్జెక్టులకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పరీక్ష తర్వాత 15 నుంచి 20 రోజుల్లోగా ఫలితాలు వెల్లడిస్తాం.
ఇక.. సెట్ నేపథ్యంలో ఏపీపీఎస్సీ నిర్వహించనున్న డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల పరీక్ష వాయిదాకు సంబంధించి ప్రభుత్వం నుంచి, ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి సంకేతాలు రావడంలేదు. సెట్‌కు అర్హత ఉన్న అభ్యర్థులు చాలామంది డీఎల్ పరీక్షను వాయిదా వేయించాలని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. -ఎస్.సత్యనారాయణ, ఏపీ సెట్ ఛైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్
No comments:
Post a Comment