Tuesday, April 9, 2013

ఇంటర్ తర్వాత అవకాశాలివిగో..


ఇంటర్ పూర్తయ్యాక ఏం చేయాలి అనేది చాలా కీలకమైన, సంక్లిష్టమైన ప్రశ్న! ఈ కీలకమైన ప్రశ్నకు సరైన నిర్ణయాన్ని బట్టే విద్యార్థి యావత్ కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న అనేకానేక అవకాశాల్లోంచి.. సరైన కోర్సును, కెరీర్‌ను ఎంచుకోవడం అంతతేలికకాదు. ఒక రకంగా ఇంటర్ తర్వాత తీసుకునే నిర్ణయం ‘‘మేక్ ఆర్ బ్రేక్’’ లాంటిది. ఐటీ, సాంకేతిక విప్లవం, వరల్డ్‌వైడ్ వెబ్ ఆవిష్కరణ, గ్లోబలైజేషన్ కారణంగా.. ఒకవైపు తీవ్ర పోటీ ప్రపంచం.. మరోవైపు అపార అవకాశాలు.. శరవేగంగా మారిపోతున్న మార్కెట్.. దాంతో నేడు ప్రతి విద్యార్థికి కెరీర్ ప్లానింగ్ అనేది గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితిలో కెరీర్ నిర్ణయం కత్తిమీద సాములాంటిదే!ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ.. ఇలా వివిధ గ్రూప్ సబ్జెక్టుల ద్వారా ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థి ముందున్న కోర్సులు, జాబ్స్‌తోపాటు తన ఆసక్తులు, అవసరాలకు తగ్గ కోర్సు లేదా జాబ్ ఎంచుకోవడం కీలకం.

మన రాష్ట్రంలో పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ ఏకైక లక్ష్యంగా ఇంటర్‌లో ఎంపీసీలో చేరతారు. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో చేరాలనుకున్న విద్యార్థులు ఇంటర్‌లో బైపీసీలో అడ్మిషన్ తీసుకుంటారు. కామర్‌‌సపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సీఈసీలో చేరతారు. ఇంటర్ తర్వాత సాంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకుంటే.. బీఎస్సీ, ఆర్ట్స్/హ్యుమానిటీస్(బీఏ), కామర్స్(బీకామ్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా.. ఒకేషనల్ కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు, స్పెషల్ కోర్సులు, పారామెడికల్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులనూ ఎంచుకోవచ్చు.
ఇంటర్‌లో ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బైపీసీ(బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ), సీఈసీ(కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్), లేదా హెచ్‌ఈసీ(హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్).. ఏ గ్రూప్‌లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థైనా.. మూడు ప్రశ్నలు వేసుకోవాలి.. అవి..

* తనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏంటి? కోర్సులు.. జాబ్స్?
* తన ఇష్టాయిష్టాలు, ఆసక్తులు, అవసరాలు, బలాలు, బలహీనతలు ఏమిటి?
* తన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి?జాబ్ చే స్తూనే చదువుకోవాలంటే.. మార్గం ఏంటి?

పై ప్రశ్నలకు సమాధానం ద్వారా ఇంటర్మీడియెట్ తర్వాత విద్యార్థి తనకు అందుబాటులో ఉన్న, తనకిష్టమైన కోర్సులో చేరొచ్చు. లేదా తన అర్హతలతో లభించే ఉద్యోగం లేదా స్వయం ఉపాధి చూసుకోవచ్చు. ఇంటర్ పూర్తయిన ఎక్కువమంది ఆలోచన.. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరడం. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నవాళ్లు ఉద్యోగ సాధన, లేదా స్వయం ఉపాధివైపు దృష్టిసారించొచ్చు.

ఎంపీసీ ఇంటర్మీడియెట్: ఎంపీసీతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థి ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), నిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీలు, క్యాంపస్ కాలేజీలతోపాటు ప్రయివేట్ కాలేజీలో బీఈ/బీటెక్‌లో చేరొచ్చు. ఐఐటీలు, నిట్‌ల్లో చేరాలనుకుంటే.. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించాలి. అదేవిధంగా రాష్ట్రంలోని క్యాంపస్ కాలేజీలు, ప్రయివేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో అడ్మిషన్స్ కోసం ఎంసెట్ రాయాలి. ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజీ, ఎంసెట్ మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటి ంచి, ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్‌‌స అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్ బ్రాంచ్‌లతోపాటు ఏరోనాటికల్, ఆటోమొబైల్, కెమికల్, మెట్లర్జికల్, మైనింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ వంటి అప్‌కమింగ్ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నా యి. ఇంటర్మీడియెట్ ఎంపీసీ పూర్తిచేసినవారు సంప్రదాయ డిగ్రీ కోర్సు అయిన బీఎస్సీలోనూ చేరొచ్చు.

బైపీసీ ఇంటర్: బైపీసీతో ఇంటర్మీడియెట్ పూర్తిచేశాక.. రాష్ట్రస్థాయిలో ఎంసెట్, జాతీయ స్థాయిలో నీట్, జిప్‌మర్, ఎయిమ్స్ వంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసి.. ఆయా విద్యాసంస్థల్లో మెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే వారితో పోలిస్తే.. మెడిసిన్‌ను లక్ష్యంగా ఎంచుకున్న విద్యార్థులు గట్టిపోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో కాలేజీలు, సీట్లు ఎక్కువ సంఖ్యలోనే ఉండగా.. మెడికల్ సీట్లు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. దాంతో ఎంబీబీఎస్ వంటి ప్రతిష్టాత్మక మెడికల్ కోర్సుల్లో చేరాలనుకునే వారికి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్‌తోపాటు బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, అగ్రికల్చర్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ వంటి కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. బైపీసీ ఇంటర్మీడియెట్ విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సు అయిన బీఎస్సీలోనూ చేరొచ్చు.

ఇంటర్ సీఈసీ: వ్యాపార వాణిజ్యాలను బట్టే ఆర్థిక వ్యవస్థల మనుగడ, అంతిమంగా దేశ అభివృద్ధి సాధ్యమయ్యేది. అందుకే వ్యాపారం ఎంతగా విస్తరిస్తే.. కామర్స్ విద్యార్థులకు అంతగా అవకాశాలు అందివస్తాయి. సీఈసీతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థి రెగ్యులర్ కోర్సు బీకామ్‌లో చేరొచ్చు. దాంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మక జాబ్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎస్, సీఎంఏలనూ పూర్తిచేసుకోవచ్చు. బీకామ్ పూర్తయ్యాక రెగ్యులర్‌గా మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎంబీఏ), ఎంకామ్(మాస్టర్ ఆఫ్ కామర్స్) తదితర కోర్సుల్లో చేరొచ్చు.

హెచ్‌ఈసీతో ఇంటర్: ఆర్ట్స్/హ్యుమానిటీస్ కోర్సులు.. నేడు విద్యార్థులను అంతగా ఆకట్టుకోవడం లేదన్నది వాస్తవం. దీనికి ప్రధాన కారణం ప్రొఫెషనల్ కోర్సులకు పెరుగుతున్న అవకాశాలే. హెచ్‌ఈసీతో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థి ముందున్న ప్రధాన అవకాశం సంప్రదాయ డిగ్రీ కోర్సు బీఏలో చేరడం. అయితే,, కొద్దికాలంగా పలు యూనివర్సిటీలు ఈ విభాగంలోనూ ట్రావెల్ అండ్ టూరిజం, అడ్వర్‌టైజింగ్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి వినూత్న జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. దాంతోపాటు సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఈ ఆర్ట్స్/హ్యుమానిటీస్ కోర్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

స్పెషల్ కోర్సులు: సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులతోపాటు స్పెషల్ కోర్సులకూ అవకాశాలు పెరుగుతున్నాయి. దాంతోపాటే ఆయా కోర్సుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫొరెన్సిక్ సైన్స్, ఆప్టోమెట్రీ, డెయిరీ టెక్నాలజీ, న్యూట్రిషన్, హోంసైన్స్, ఓషనోగ్రఫీ, జెమ్మాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, హార్టికల్చర్, ఫారె స్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్, మర్చెంట్ నేవీ, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫిల్మ్ అండ్ మీడియా, సెక్రటేరియల్ వర్క్, తదితర స్పెషల్ కోర్సులనూ ఇంటర్ తర్వాత ఎంచుకోవచ్చు.

ఇంటిగ్రేటెడ్ కోర్సులు: డిగ్రీ ఒకచోట, పీజీ మరోచోట కాకుండా.. వరుసగా రెండూ ఒకే చోట పూర్తిచేయాలనుకునే వారి కోసం ప్రవేశపెట్టినవే.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు. ఈ కోర్సుల ద్వారా ఇంటర్ తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా పీజీ వరకూ ఏకధాటిగా చదువు కొనసాగించే వీలు కలుగుతుంది. ఒకవేళ కోర్సులో చేరిన మూడేళ్ల తర్వాత వద్దనుకుంటే.. డిగ్రీ సర్టిఫికెట్; నాలుగేళ్ల తర్వాత వద్దనుకుంటే హానర్స్ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

పారామెడికల్ కోర్సులు: ఇంటర్ బైపీసీ తర్వాత తక్కువ కాల వ్యవధిలో ఉద్యోగావకాశాలు అందించే కోర్సులు.. పారా మెడికల్ కోర్సులు. రోగికి డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్, థెరపీ సరిగా జరిగేలా డాక్టర్‌కు సహకరించే వారే పారామెడికల్ నిపుణులు. ఆరోగ్య రంగంలో పారామెడికల్ నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఆరోగ్య రం గంలో అవకాశాలు అపారం. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్,ఈసీజీ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంకింగ్ టెక్నీషియన్, అనస్థీసియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డార్క్ రూమ్ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్, ఎంపీహెచ్‌పీపీ, థియేటర్ టెక్నీషియన్ వంటి కోర్సులు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.

సర్టిఫికెట్ కోర్సులు:
ఇంటర్ పూర్తయ్యాక కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీర్ఘకాలిక రెగ్యులర్ కోర్సుల్లో చేరే వీలు లేని వారు.. స్వల్పకాలిక ఒకేషనల్ కోర్సులు, సర్టిఫికెట్ కోర్సుల ద్వారానూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. డీటీపీ ఆపరేటర్, కాల్ సెంటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, నెట్‌వర్క్ టెక్నీషియన్, కంప్యూటర్ హార్డ్‌వేర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, సర్టిఫికెట్ ఇన్ వెబ్ డిజైనింగ్, సర్టిఫికెట్ ఇన్ విమెన్ స్టడీస్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మల్టీమీడియా తదితర స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సుల్లో చేరొచ్చు.

జాబ్స్: ఇంటర్ అర్హతతో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగాలు, వీఆర్‌వో, రైల్వేజాబ్స్, పోలీసు కానిస్టేబుల్స్, త్రివిధ దళాలు... గ్రూప్-4. ఇలా పలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటర్‌తోనే సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. ఇవేకాకుండా.. వాస్తవానికి ఇంకా ఎన్నో కోర్సులు, కెరీర్స్, అవకాశాలు ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. కావల్సిందల్లా.. ఆయా కోర్సుల గురించి నిశితంగా తెలుసుకొని, కొంత విశ్లేషణ చేసుకొని, నిపుణుల సలహాలు తీసుకొని మనకు ఏది సరిపోతుందో దాన్ని ఎంచుకోవడమే!!

కోర్సు-కెరీర్ - మెళకువలు..

* వివిధ ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. వ్యక్తిగత ఆసక్తులను గమనించాలి.. నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాలి.

* చేరాలనుకుంటున్న కోర్సును అందించే మంచి కాలేజీలు, ఆయా కోర్సులో చేరేందుకు మార్గం, ప్రవేశప్రక్రియ తీరుతెన్నులు తెలుసుకోవాలి. జాబ్ మీ లక్ష్యమైతే.. దాన్ని సాధించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలి.

* ఇంటర్నెట్‌ను వినియోగించుకొని చేరనున్న కోర్సుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ముందే సేకరించుకొని భవిష్యత్‌కు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

* సదరు కోర్సు ద్వారా ఇప్పటికే ఆ రంగంలో రాణిస్తున్న వారితో నెట్‌వర్‌‌క ఏర్పరచుకొని వారి సలహాలు, సూచనలు, సరికొత్త మార్పులను తెలుసుకోవాలి.

* చేరిన కోర్సులో టాప్‌లో నిలవాలంటే.. నిరంతరం అధ్యయనం కొనసాగించాలి. అందుకోసం సీనియర్లు, ఇంటర్నెట్, లైబ్రరీలను వినియోగించుకోవాలి. నిపుణులను, ప్రొఫెసర్లను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలి.

No comments:

Post a Comment