Tuesday, April 9, 2013

ఇంజనీరింగ్


క్యాంపస్ నియమాకాలు.. కళ్లు చెదిరే పే-ప్యాకేజ్‌లు.. కోర్సు పూర్తి కాక ముందే చేతిలో జాబ్ ఆఫర్ లెటర్.. సామర్థ్యం ఉంటే ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం.. వెరసి సమున్నత కెరీర్‌కు వేదికగా నిలుస్తోన్న కోర్సు.. ఇంజనీరింగ్.. నేటి టెక్నాలజీ యుగంలో.. మారుతున్న ప్రపంచంలో ఇంజనీర్లకు ఉన్న డిమాండ్ మరే ఇతర నిపుణులకు లేదనడంలో సందేహం లేదు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ నేడు ఇంటర్ చదివే ప్రతి విద్యార్థి కోరుకునే కెరీర్‌గా మారింది..

దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇంజనీరింగ్ కోర్సుకు ఉన్న డిమాండ్ మరే ఇతర కోర్సులకు లేదనడంలో ఎటువంటి సందేహం లేదు.. ప్రతి ఏటా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి.. పలు రకాల ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దోహదం చేసే ఎంట్రెన్‌‌స టెస్టులు.. కోర్సు పరంగా పాపులర్ బ్రాంచ్‌లు.. సంబంధిత అకాడెమిక్ అంశాలపై సమగ్ర విశ్లేషణ...

ప్రవేశం ఇలా

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), బిట్స్, ట్రిపుల్ ఐటీలు, మన రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజ్‌ల్లో ప్రవేశం కోసం పలు రకాల ఎంట్రెన్స్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న ప్రవేశ పరీక్షలను పరిశీలిస్తే...

జేఈఈ-మెయిన్:
ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ఇతర జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి గతంలో నిర్వహించే ఏఐఈఈఈ స్థానంలో జేఈఈ మెయిన్ పరీక్షను ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష రెండు పేపర్లు (పేపర్-1,2)గా ఉంటుంది. ఈక్రమంలో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు పేపర్-1కు హాజరుకావాలి. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. బీ.ఆర్క్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు పేపర్-2కు హాజరు కావాలి. ఇందులో మ్యాథమెటిక్స్, డ్రాయింగ్ ఆప్టిట్యూడ్ విభాగాలపై ప్రశ్నలు వస్తాయి. ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం వెయిటేజీ కలిపి తుది ర్యాంక్ నిర్ధారిస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంక్ ద్వారా మొత్తం 71 ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో (30 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, 5 ట్రిపుల్ ఐటీలు, 36 ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు) ప్రవేశం పొందొచ్చు. దీనిద్వారా జేఈఈ అడ్వాన్‌‌సడ్‌కు అర్హత లభిస్తుంది.
వివరాలకు: http://jeemain.nic.in


జేఈఈ అడ్వాన్స్‌డ్:
ఐఐటీల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు తప్పనిసరిగా జేఈఈ అడ్వాన్స్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. జేఈఈ-మెయిన్‌లో ప్రతిభ చూపిన మొదటి లక్షన్నర మంది విద్యార్థులను మాత్రమే జేఈఈ- అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభతోపాటు, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల్లో టాప్ 20 పర్సెంటైల్‌లో నిలిచిన అభ్యర్థులకు మాత్రమే ఐఐటీల్లో ప్రవేశం కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు పేపర్లు (పేపర్-1,2)గా ఉంటుంది. ఈ ర్యాంక్ ద్వారా 15 ఐఐటీలతోపాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్‌లలో ప్రవేశం పొందొచ్చు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) -తిరువనంతపురం కూడా జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగానే అడ్మిషన్ కల్పిస్తుంది.
వివరాలకు: http://jeeadv.iitd.ac.in/


బిట్‌శాట్:
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్).. ఐఐటీలు, ఎన్‌ఐటీల తర్వాత అత్యధిక మంది బీఈ/బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ప్రాధాన్యతనిస్తున్న ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్. ఇందులో ప్రవేశం కోసం ప్రతి ఏటా నిర్వహించే బిట్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్) లో మూడు గంటల వ్యవధిలో నాలుగు విభాగాల్లోని 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అవి.. ఫిజిక్స్ (40 ప్రశ్నలు-120 మార్కులు), కెమిస్ట్రీ (40 ప్రశ్నలు-120 మార్కులు), ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ (15 ప్రశ్నలు-45 మార్కులు), లాజికల్ రీజనింగ్ (10 ప్రశ్నలు-30 మార్కులు), మ్యాథమెటిక్స్ (45 ప్రశ్నలు - 135 మార్కులు). మొత్తం మార్కులు-450. ఈ ర్యాంక్ ద్వారా పిలానీ, గోవా, హైదరాబాద్‌లలోని బిట్స్ క్యాంపస్‌లలో ప్రవేశం పొందొచ్చు. సంబంధిత నోటిఫికేషన్ డిసెంబర్ చివరి/జనవరి మొదటి వారంలో వెలువడుతుంది.
వివరాలకు: www.bitsadmission.com

ఎంసెట్:
మన రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మసీ సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విభాగం కోసం నిర్వహించే పరీక్షలో మూడు గ్రూపు సబ్జెక్టులు.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 160 ప్రశ్నలు అడుగుతారు. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులు వెల్లడిస్తారు. ఎంసెట్ ద్వారా దాదాపు 750 ఇంజనీరింగ్ కళాశాలల్లో, 280 బీ ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ పొందొచ్చు.
వివరాలకు: www.apeamcet.org

విట్:
మన రాష్ట్ర విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి ఆసక్తి చూపుతున్న ఇన్‌స్టిట్యూట్‌లలో వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)-వెల్లూరు (తమిళనాడు) ఒకటి. ఇందులో ప్రవేశానికి నిర్వహించే విట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (వీఐటీఈఈఈ) లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ /బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి 40 ప్రశ్నల చొప్పున వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. వివరాలకు: www.apeamcet.org

ఎస్‌ఆర్‌ఎంఈఈ:
మన రాష్ట్ర విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో చేరడానికి ఆసక్తి చూపుత్ను మరో ఇన్‌స్టిట్యూట్ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-తమిళనాడు. ఇందులో ప్రవేశం కోసం ఎస్‌ఆర్‌ఎంఈఈ(ఎస్‌ఆర్‌ఎం ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) నిర్వహిస్తారు. ఇందులో ఫిజిక్స్,కెమిస్ట్రీ,మ్యాథమెటిక్స్‌లపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 35 ప్రశ్నల చొప్పున వస్తాయి.
వెబ్‌సైట్: www.srmuniv.ac.in

వినూత్న కోర్సులు:
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ద్వారా రెగుల్యర్ బీఈ/బీటెక్ కోర్సులతోపాటు.. బీఫార్మసీ, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డిజైన్), ఎంఫార్మ్ డ్యూయల్ డిగ్రీ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ఇతర కోర్సులు కూడా ఉన్నాయి. అవి.. బీఎస్ కోర్సులు, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు, బీఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు, ఎంఎస్సీ టెక్ ఇంటిగ్రేటెడ్, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్‌లు, బీటెక్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు బిట్స్‌లో కూడా బీఈ/బీటెక్ కోర్సులతోపాటు ఎంచుకోవడానికి పలు వినూత్న కోర్సులు కూడా ఉన్నాయి. అవి.. బీఫార్మసీ (ఆనర్స్), ఎంఎస్సీ (ఆనర్స్). ఎంఎస్సీ- టెక్.

ఇంజనీరింగ్.. దినదినప్రవర్థమానం

ఇంజనీరింగ్.. గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడు కోణాల్లోనూ వన్నె తరగని కోర్సుగా మనుగడ సాగిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులు, సమీప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే రోజుకో కొత్త టెక్నాలజీ, ప్రతి రోజు నూతన ఆవిష్కరణలతో ఇంజనీరింగ్ విభాగం దినదినప్రవర్ధమానంగా మారడం ఖాయం. ఇంజనీరింగ్‌లో చేరే ప్రతి విద్యార్థి మదిలో మెదిలే ఆలోచన ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి? అనేదే. ప్రస్తుత సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తే భవిష్యత్తు అంతా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీదే. కాబట్టి వీటికి సంబంధించిన బ్రాంచ్‌లను ఎంచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా ఇటీవల కాలంలో బయో మెడికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ బ్రాంచ్‌లు కూడా పాపులర్ బ్రాంచ్‌లుగా మారుతున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా అభ్యర్థి తన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. ఆసక్తి మేరకు బ్రాంచ్‌ను ఎంచుకోవాలి. ఏ బ్రాంచ్ అయినప్పటికీ చక్కటి నాలెడ్జ్ సొంతం చేసుకుంటే కలర్‌ఫుల్ కెరీర్ ఖాయం.

పాపులర్ బ్రాంచ్‌లు:
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మెకానికల్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
ఏరోనాటికల్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
బయోటెక్నాలజీ

కొలాబరేటివ్, కోఆపరేటివ్:
ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం.. కొలాబరేటివ్, కోఆపరేటివ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం. అంటే.. ప్రతి అంశాన్ని సహచరులతో కలిసి బృందాలుగా చదవడం వల్ల సరికొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. కారణం ఇంటర్-పర్సనల్ స్కిల్స్ లేకపోవడమే. వీటిని పెంచుకోవడానికి మొదటి సంవత్సరం నుంచే ప్రయత్నించాలి. అంతేకాకుండా సెల్ఫ్ కొశ్చనింగ్, సెల్ఫ్ లెర్నింగ్, అప్లికేషన్, సబ్జెక్ట్స్ మధ్య కనెక్టివిటీ విషయాలపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగాలి.

ఉన్నత విద్య:
ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ తర్వాత పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చదివే అవకాశం ఉంది. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి.. గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్), పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్). ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు, నిట్‌లు సహా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా.. గేట్ స్కోర్‌తో ఎంటెక్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. పీఎస్‌యూలు ఎంట్రీలెవల్ రిక్రూట్‌మెంట్స్‌కు గేట్ స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఫార్మ్‌డీ (పోస్ట్ బాక్యులరేట్) కోర్సులలో పీజీఈసెట్ ద్వారా ప్రవేశం పొందొచ్చు. మేనేజ్‌మెంట్ వైపు ఆసక్తి ఉంటే క్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ రాయొచ్చు. విదేశాల్లో ఎంఎస్ కూడా చేయవచ్చు.

చక్కటి అవకాశం.. ఐఈఎస్:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏటా నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఎగ్జామ్ ప్రభుత్వ రంగంలో స్థిరపడాలనుకునే ఇంజనీరింగ్ పట్టభద్రులకు చక్కని అవకాశంగా భావించవచ్చు. ఈ పరీక్ష ద్వారా రైల్వేస్, సెంట్రల్ వాటర్ బోర్డు, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్, మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి గ్రూప్-ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పరీక్షను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో నిర్వహిస్తారు. రక్షణ దళాల్లో కమిషన్డ్ ర్యాంకు అధికారుల నియామకం కోసం నిర్వహించే సీడీఎస్ పరీక్షకు బీటెక్ అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1,2, బ్యాంక్ పరీక్షలు, అన్ని రకాల ఉద్యోగ నియామకాల పరీక్షలకు కూడా వీరు హాజరు కావచ్చు.

మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ ఉంటే...
ఇంజనీరింగ్‌లో చేరే అభ్యర్థులకు మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ ఉంటే కోర్సులోనూ, భవిష్యత్తులోనూ మంచి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా కోర్సులో చేరే విద్యార్థులు పట్టుదల, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ అప్రోచ్ అలవర్చుకోవాలి. అప్పుడే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. కానీ రాష్ట్రంలో దాదాపు 750 కళాశాలల ద్వారా ప్రతి ఏటా 2.50 లక్షల సీట్లు భర్తీ అవుతున్నా..అత్యధిక శాతం విద్యార్థులు ఈ స్కిల్స్ లేకనే ఉద్యోగ సాధనలో వెనకబడుతున్నారు. ఇంజనీరింగ్‌లో చేరిన తొలి రోజు నుంచే స్వీయ అధ్యయనం దిశగా కృషి చేయాలి. ఇక.. ఉద్యోగాల డిమాండ్-సప్లయ్ పరంగా విశ్లేషిస్తే అధిక శాతం విద్యార్థులు ఎలక్ట్రానిక్స్, సీఎస్‌ఈలకు తొలి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో కోర్ బ్రాంచ్‌లైన సివిల్, మెకానికల్ విభాగాల్లో మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్‌లు నిలుస్తున్నాయి. కేవలం బీటెక్‌తో సరిపెట్టుకోకుండా ఉన్నత విద్య వైపు దృష్టి సారిస్తే భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది.

ఎగ్జామ్- సీట్ల సంఖ్య
జేఈఈ-మెయిన్ -34,311
జేఈఈ-అడ్వాన్స్‌డ్- 9,647
ఎంసెట్ -2,50,000
బిట్‌శాట్ -2,000
విట్‌ఈఈఈ- 3,300
ఎస్‌ఆర్‌ఎంఈఈ -5,000

టాప్ కాలేజ్‌లు:
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు
* ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
* బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ
* వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-వెల్లూరు (తమిళనాడు)
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-తిరువనంతపురం
* ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీలు)

No comments:

Post a Comment