Wednesday, January 11, 2012

AP TET COMPLETE DETAILS

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్... టెట్.. ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ వృత్తిని కోరుకునే ప్రతి అభ్యర్థి తక్షణ లక్ష్యంగా మారింది. విద్యా హక్కు చట్టం ప్రకారం.. ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టాలనుకునే ప్రతి అభ్యర్థికి టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేయడమే ఇందుకు ప్రధాన కారణం.

ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ టెట్‌కు ఈ ఏడాదే శ్రీకారం చుట్టారు. తొలిసారి గత జూలైలో నిర్వహించగా.. మలి విడత డిసెంబర్‌లో జరగనుంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో టెట్‌కు సన్నద్ధ సలహాలు..

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అభ్యర్థి ఉపాధ్యాయుడిగా మారాలంటే నాలుగు దశలు అధిగమించాలి. అవి... అకడెమిక్ విద్యార్హత (ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ); బీఈడీ లేదా డీఈడీ; టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్; డీఎస్సీ ఎంట్రెన్స్. వాస్తవానికి గత ఏడాది వరకు ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టే వారు డీఎస్సీలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోయేది. అయితే తాజాగా ఈ ఏడాది నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేరిట మరో దశ దాటాల్సిందే.

టెట్ వెయిటేజీ:
బీఈడీ లేదా డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్‌ను కేవలం పరీక్షగానే ఆలోచించకూడదు. కారణం టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ కల్పించడమే! డీఎస్సీలో సాధించిన మార్కులకు 80 శాతం, టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. వాస్తవానికి టెట్‌లో ఉత్తీర్ణత మార్కులు సొంతం చేసుకోవడం బీఈడీ లేదా డీఈడీ అర్హులకు సులభమే. కానీ టెట్‌లో ఎక్కువ మార్కులు సాధిస్తే ఎక్కువ వెయిటేజీ లభిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

రెండు పేపర్లుగా టెట్:
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2)గా జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లుగా చేరాలనుకుంటే పేపర్-1; ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని ఆశిస్తే పేపర్-2 రాయాలి. పేపర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. సిలబస్‌ను పరిగణిస్తే కొన్ని ఉమ్మడి అంశాలు ఉంటాయి. అవి..
* చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ (సైకాలజీ)
* లాంగ్వేజ్-1 తెలుగు లాంగ్వేజ్-2 ఇంగ్లిష్

సన్నద్ధం కావాలంటే:
బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు టెట్‌లో ఉత్తీర్ణత నల్లేరుపై నడకే. ప్రధానమైన అంశం ఎక్కువ మార్కులు సొంతం చేసుకుని భవిష్యత్తులో లభించే వెయిటేజీని పెంచుకోవడానికి సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్ చిట్కాలు..

సైకాలజీ:
ఈ సబ్జెక్టులో ముఖ్యంగా పేపర్-1 రాసే అభ్యర్థులు చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీలో నవజాత శిశువు నుంచి.. ఉత్తర బాల్య దశకు ఉండే ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయాలి.

పేపర్-2 అభ్యర్థులు కౌమార దశకు సంబంధించిన ప్రవర్తనాంశాలను క్షుణ్నంగా ఆకళింపు చేసుకోవాలి.

సైకాలజీ సబ్జెక్టులో మూడు యూనిట్లు ముఖ్యం. అవి..
డెవలప్‌మెంట్ ఆఫ్ ది చైల్డ్: ఇందులో శిశువు ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయాలి.
అభ్యసనం: మానసిక ప్రవర్తనలో మార్పును వివరించే ఈ యూనిట్ కూడా ముఖ్యం
పెడగాజీ: ప్రవర్తనలో మార్పు దిశగా శాస్త్రీయ బోధనను చేపట్టే విధానాన్ని వివరించే యూనిట్ ఇది.

సైకాలజీని అభ్యసనం చేసేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా, సమన్వయం చేస్తూ చదవాలి.

ఉదాహరణ: యత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని చదివేటప్పుడు దాని రూపకర్త థార్న్‌డైక్ గురించి, ఆ సిద్ధాంతంలోని ప్రాథమిక నియమాలైన సన్నద్ధ సూత్రాలు, అభ్యాస సూత్రం, ఫలిత సూత్రం, ఇతర గణ నియమాలు, వాటి తరగతి అన్వయం, సారూప్య నియమం.. వాటి ఆధారంగా ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపునకు సంబంధించి స్వరూప చాలకాల సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. అదే విధంగా అతను ప్రతిపాదించిన బహుకారక సిద్ధాంతం, అతని గ్రంథం ‘మెజర్‌మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్’ గురించి కూడా తెలుసుకోవాలి.

పెడగాజీ:
పెడగాజీ అంటే బోధన శాస్త్రం. అభ్యర్థులు ఎక్కువ ఆందోళన చెందే విభాగమిదే. మెటీరియల్, రిఫరెన్స్ బుక్స్ లభ్యత కనిష్టంగా ఉంటుంది. ఇందులోని కీలకాంశాలైన శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం - నాయకత్వం -మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్)లను గత ప్రశ్న పత్రాల ఆధారంగా సిలబస్‌ను అనుసరించి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.

లాంగ్వేజ్ 1 (తెలుగు):
‘శిశువుకు తల్లిపాలు ఎలాంటివో మాతృభాషలో బోధన అలాంటిది’- రవీంద్రనాథ్ ఠాగూర్. మాతృభాషలో బోధన ప్రాధాన్యాన్ని తెలిపే సూక్తి ఇది. అందుకే అభ్యర్థులకు మాతృభాషపై పట్టు, మాతృ భాషలో బోధన పటిమను పరీక్షించేందుకు తెలుగు లాంగ్వేజ్ విభాగాన్ని ప్రవేశ పెట్టారు. పాఠశాల స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ బుక్స్‌తోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవడం ద్వారా అభ్యర్థి ఈ విభాగంలో పట్టు సాధించొచ్చు.

కంటెంట్:
చాలా మంది అభ్యర్థులు టెట్ కంటెంట్ గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రణాళికాబద్ధంగా చదవితే దాన్ని ఇట్టే అధిగమించొచ్చు. పేపర్-1లో అయిదో తరగతి స్థాయిలోని పాఠ్యాంశాలు, ఆ పాఠ్యాంశాల చివరన ఇచ్చే ప్రాక్టీస్ బిట్స్ చదవాలి. పేపర్-2 కంటెంట్‌కు సంబంధించి 6, 7, 8 తరగతుల పాఠ్య పుస్తకాలను టెట్ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటూ చదవాలి. గత పరీక్షను పరిశీలిస్తే ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో పాఠ్యాంశాల చివరన ఇచ్చిన బిట్స్‌నుంచే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. దీన్ని గుర్తించి చదవడం ఎంతో మేలు చేస్తుంది.

సోషల్ స్టడీస్:
అరవై మార్కులకు ఉండే ఈ పేపర్లో మంచి మార్కులు సాధించడానికి.. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. వీటిని డీఎస్సీ దృష్టితో చదివితే రెంటికీ ఉపయుక్తంగా ఉంటుంది. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతం ఏ అక్షాంశాల మధ్య ఉంది... వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.

అదేవిధంగా పౌరనీతి శాస్త్రం, అర్థ శాస్త్రం చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలు, పరిణామాలకు అన్వయిస్తూ చదవాలి. గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు సంబంధించి ఈ సబ్జెక్టులకు ఉండే ఆబ్జెక్టివ్ విధానంలోని బిట్స్‌ను ప్రాక్టీస్ చేయడం కూడా ఉపకరిస్తుంది. మెథడాలజీ విషయంలో ఆందోళన అనవసరం. బీఈడీ మెథడాలజీకి సన్నద్ధమైన తరహాలో చదవడం లాభిస్తుంది.

ఇలా చదవండి:
మన విద్యా విధానంలో పాఠ్యాంశాలను రూపొందించేటప్పుడు ఏకకేంద్ర విధానాన్నే పాటిస్తున్నారు. ఉదా: ఒక పాఠ్యాంశానికి సంబంధించి ప్రాథమిక భావనలను కింది తరగతుల్లో రూపొందించి.. ఎగువ తరగతులకు వెళ్లే కొద్దీ వాటి క్లిష్టత స్థాయిని పెంచుతూ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. కాబట్టి.. అభ్యర్థులు కంటెంట్ చదివేటప్పుడు.. ఏదైనా ఒక అంశం 3, 4, 5, తరగతి పుస్తకాల్లో ఉండి.. 6, 7, 8, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమైతే.. ఆ అంశాలన్నింటినీ ఒకేసారి చదవడం వల్ల సమన్వయం ఏర్పడుతుంది.

తమ నేపథ్యానికి చెందని పాఠ్యాంశాలు (అంటే.. బయాలజీ వాళ్లు గణితం చదవడం, తెలుగు, ఇంగ్లిష్ అభ్యర్థులు సోషల్ స్టడీస్ చదవడం) చదివేటప్పుడు కొంత ఇబ్బందికి గురవడం సహజం. అయితే అభ్యర్థులు ఇప్పటికే పీజీ స్థాయి అవగాహన కలిగుంటారు కాబట్టి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠ్యాంశాల విషయంలో సిలబస్‌ను అనుసరిస్తూ.. ప్రతి పాఠ్యాంశం వెనుక ఇచ్చిన బిట్స్‌ను ఔపోసన పడితే సులభంగానే అధిగమించొచ్చు.
- డా॥మోజెస్, డెరైక్టర్, ఎమిలీ అకాడెమీ

రిఫరెన్స్ బుక్స్:
* విద్యా మనో విజ్ఞాన శాస్త్రం- డీఈడీ, బీఈడీ పాఠ్య పుస్తకాలు
* బోధన శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం- తెలుగు అకాడెమీ
* నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్-2008
* విద్యా హక్కు చట్టం
.......................

సైన్స్

ఈ సబ్జెక్ట్ కోసం కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. అంతకంటే ఎక్కువ స్థాయిలో అంటే పదో తరగతి వరకు పస్తకాలను చదవడం వల్ల పేపర్-2కు మరింత లాభిస్తుంది. విశ్లేషణాత్మక ప్రిపరేషన్ అవసరం. ఇందుకోసం ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. పేపర్-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు క్లిష్టంగానే ఉన్నాయి.

చదివేటప్పుడు ఆయా అంశాల నుంచి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవడం మేలు. అంతేతప్ప కేవలం ఆబ్జెక్టివ్ మెటీరియల్‌పై ఆధారపడటం సరికాదు. సైన్స్ మెథడాలజీ విషయంలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, ఎవాల్యుయేషన్, సైన్స్ ల్యాబ్ అంశాలపై పట్టు సాధించాలి.

గణితం
గణితం విషయంలో అభ్యర్థులు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అవసరం. అంతేకాకుండా బ్యాంక్ పరీక్షల కోసం లభించే న్యూమరికల్ ఎబిలిటీ ప్రాక్టీస్ పేపర్లలోని బిట్స్‌ను కూడా సాధన చేయాలి. కంటెంట్‌పై పట్టు కోసం కమర్షియల్ మ్యాథమెటిక్స్‌లో రాణించాలి.

గణితం మెథడాలజీ విషయంలో డీఎస్సీ తరహాలోనే ప్రిపరేషన్ సాగించాలి. తెలుగు అకాడెమీ పుస్తకాలు, ఆబ్జెక్టివ్ మెటీరియల్ చదవాలి. ఇందులో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ ఇన్ హిస్టరీ, మ్యాథమెటిక్స్ రిలేషన్ టు అదర్ సబ్జెక్ట్స్, ఎవాల్యుయేషన్‌లు కీలకాంశాలు. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి.

ఇంగ్లిష్
టెట్‌లో అత్యధిక మార్కుల సాధనలో ‘ఇంగ్లిష్’ కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ సబ్జెక్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కంటెంట్, మెథడాలజీ రెండు విభాగాలుగా పేపర్-1, పేపర్-2లలో ఇంగ్లిష్ సబ్జెక్టును పరీక్షిస్తారు.
గతంలో నిర్వహించిన టెట్‌లో ఇంగ్లిష్ కంటెంట్ విభాగాన్ని పరిశీలిస్తే.. గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ.. ప్రశ్నలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే.. బేసిక్ గ్రామర్ మీద పట్టు చాలా అవసరం. ఈ క్రమంలో.. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రొవెర్బ్స్, కొశ్చన్స్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్-ప్యాసివ్ వాయిస్, కాంప్రెహెన్షన్, ఫోనెటిక్స్, లెటర్ రైటింగ్, సింపుల్- కాంపౌండ్- కాంప్లెక్స్ సెంటన్సెస్ ఇలా గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని ఔపోసన పట్టాలి.

మెథడాలజీ విషయానికొస్తే.. టీచింగ్ మెథడ్స్, టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం), రీసెంట్ ట్రెండ్స్(ఇటీవలి కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు/పథకాలు), డెవలప్‌మెంట్ ఆఫ్ కరికుల్యం వంటివి ప్రధాన అంశాలు.

పేపర్-1, పేపర్-2లో అడిగే అంశాలు ఒక్కటే సమానమైనప్పటికీ.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపేర్ కావాలి. సిలబస్ పరిధి డిగ్రీ స్థాయిలోనే ఉంటుంది.

రిఫరెన్స్ బుక్స్:
* ఇంగ్లిష్ గ్రామర్ కోసం-రెన్ అండ్ మార్టిన్, మార్కెట్లో లభించే ఏదైనా స్టాండర్డ్ బుక్.
* మెథడాలజీ కోసం-తెలుగు అకాడమీ పుస్తకాలు.

No comments:

Post a Comment