Friday, February 24, 2012

అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) ఉద్యోగానికి ఎలా సిద్ధపడాలి..?



అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) ఉద్యోగానికి ఎలా సిద్ధపడాలి? కెరీర్ ఏవిధంగా ఉంటుంది?

ఏసీఎఫ్ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లు, ఇంటర్వ్యూ ఉంటాయి. పేపర్ -1కు 150 మార్కులు(జనరల్ స్టడీస్), పేపర్ -2కు 300 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. 

జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రం, సిలబస్, ప్రశ్నల స్వరూపం, ప్రశ్నల స్థాయి గ్రూప్-1నే పోలి ఉంటుంది. హిస్టరీ ప్రిపరేషన్ క్రమంలో చారిత్రక సంఘటనలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీలు, సంవత్సరాలను సులువుగా గుర్తుంచుకునేందుకు వీలుగా పట్టికలు, చార్టులను రూపొందించుకోవాలి. 

పాలిటీ, ఎకానమీ కోసం ఆయా విభాగాల్లోని ప్రాథమిక అంశాలతోపాటు ఆయా రంగాల్లో సమకాలీన మార్పులు వాటి నేపథ్యాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ కోసం పదో తరగతి స్థాయి జాగ్రఫీలో పట్టు సాధించాలి. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ కోసం ఆరు నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్ పుస్తకాల్లోని అర్థమెటిక్ అంశాలు బాగా సాధన చేయాలి. ఇలాచేస్తే పేపర్-1లో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. 

చదవాల్సిన పుస్తకాలు:
ఆరు నుంచి పదోతరగతి వరకు సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలు (తప్పనిసరి)
కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష తేదీకి ముందు తొమ్మిది నెలల్లో వివిధ రంగాల్లో ముఖ్యాంశాలు (రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం) బాగా చదవాలి. 
ఇంటర్, డిగ్రీ తెలుగు అకాడెమీ- పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో ముఖ్యాంశాలు (సమ్మరీ) చదువుకోవాలి.

ఆప్షనల్ పేపర్ కోసం ఆ సబ్జెక్టుకు సంబంధించి డిగ్రీ మూడేళ్ల పుస్తకాలు బాగా అధ్యయనం చేయాలి. అవకాశం ఉంటే ఏదైనా ఒక పుస్తకాన్ని రిఫరెన్స్‌గా చదువుకోవాలి.

ఆప్షనల్ ప్రిపరేషన్:
సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని డిగ్రీ స్థాయిలో సన్నద్ధం కావాలి. 
ప్రతి చాప్టర్ ప్రిపరేషన్ పూర్తి కాగానే ముఖ్యమైన అంశాలతో టేబుల్స్ రూపొందించుకోవాలి. ఇలా చేయడం వల్ల సులువుగా గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. రివిజన్ కూడా తేలికగా చేసుకోవచ్చు.

ఆప్షనల్ ప్రశ్నల స్థాయి.. ఇలా: ఆప్షనల్ సబ్జెక్ట్‌లోని మొత్తం 150 ప్రశ్నల్లో 100 వరకు ప్రశ్నలు తేలికగా, మధ్యస్థంగా ఉంటాయి. డిగ్రీస్థాయిలో ఉన్న పరిజ్ఞానంతో వీటికి సమాధానాలు గుర్తించొచ్చు. 

మిగిలిన 50 ప్రశ్నలు కాస్త కష్టంగా ఉంటాయి. సిలబస్ మొత్తం బాగా చదివితే ఈ ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించొచ్చు. జాబ్ ప్రొఫైల్: స్టేట్ ఫారెస్ట్ సర్వీస్‌లోని గ్రూప్-1 కేడరైన అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఎంపికైవారు జిల్లాల్లో సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ (సబ్ డీఎఫ్‌ఓ)గా డీఎఫ్‌ఓకు సహాయకులుగా ఉంటారు. వీరి ప్రధాన విధులు.. అటవీ భూముల సంరక్షణ; సామాజిక అడవుల పెంపకం; వన్య జంతువుల రక్షణ; పదోన్నతుల ద్వారా డీఎఫ్‌ఓ, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర హోదాలకు చేరుకునే అవకాశం ఉంది.

No comments:

Post a Comment