ఇంజనీరింగ్, మెడిసిన్ పాసైనా.. ప్లేస్‌మెంట్‌కు గ్యారెంటీ ఉందా..! అంటే వెంటనే చెప్పలేం!! అదే సీఏ పూర్తయితే.. కోరుకున్న కెరీర్ ఖాయం అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఫైనాన్స్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఐటీ, ఔషధ తయారీ కంపెనీల్లో భారీ ప్యాకేజీలు సొంతం చేసుకోవచ్చు. ఏటా 4 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఆఫర్లు అందుకోవచ్చు.
సీఏ అనగానే కొరుకుడుపడని కోర్సు అనే అభిప్రాయముంది. కానీ ఇష్టపడి చదివితే సీఏ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదంటున్నారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెన్సీ నిపుణులు, చార్టర్డ్ అకౌంటెన్సీ ైహైదరాబాద్ బ్రాంచ్ ఛైర్మన్ దయాకర్ గెల్లి. సీఏ యాస్పెరెంట్స్ కోసం గెల్లితో సాక్షి భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ...
సీఏ ఎలా ఉంటుంది? కోర్సులో ఏం ఉంటాయి? పూర్తిచేయడానికి ఎన్నేళ్లుపడుతుంది? ప్లస్‌టూ పూర్తిచేసిన విద్యార్థులెవరైనా సీఏ పరీక్ష రాయడానికి అర్హులు. ఏటా రెండుసార్లు ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సి ఆఫ్ ఇండియా(ఐసీఏఐ).. కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సీపీటీ) నిర్వహిస్తుంది. పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
ఇందులో ఫండమెంటల్ ఆఫ్ అకౌంటెన్సీపై 60 మార్కులకు, మర్కంటైన్ లా సబ్జెక్టుపై 40 మార్కులు, సెషన్2 కింద జనరల్ ఎకానమీపై 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌పై 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంటర్‌తోపాటు సీపీటీ పూర్తి చేశాక.. ఐపీసీసీలో చేరొచ్చు. ఇందులో గ్రూప్1, గ్రూప్2 ఉంటాయి. ఈ రెండు గ్రూప్‌లు పూర్తిచేస్తే సీఏ ఫైనల్ ప్రారంభమవుతుంది.
సీఏలో కోర్సులో సబ్జెక్ట్ పరీక్షలు కష్టంగా ఉంటాయంటారు? ఎంతవరకు వాస్తవం? చార్టర్డ్ అకౌంటెన్సీ అనగానే కొంత కఠినమైన కోర్సనే భావన ఉంటుంది. సీఏ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సు. ఇంటర్ సీఈసీ తర్వాత బీకాం చదివే డిగ్రీ సిలబస్ స్టాండర్డ్‌తో పోల్చితే.. సీఏ సిలబస్ పరిధి విసృ్తతం. నాణ్యమైన వృత్తి నిపుణులను తయారుచేసే ప్రక్రియలో భాగంగానే సీఏ ఉంటుంది.
సాధ్యమైనంతవరకు అర్థం చేసుకుని చదివితే సీఏ సులువనే చెప్పొచ్చు. ఇందులో పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుందనేమాట కొంతవరకు నిజమే. ఎందుకంటే.. గడచిన కొన్నేళ్లలో సీఏలో పాస్‌పర్సంటేజ్ 5 నుంచి 8 వరకు ఉంటే.. ఇప్పుడిప్పుడే 15 నుంచి 30 శాతం వరకు ఉంటోంది. ఇది మంచి పరిణామం.
సీఏలో కష్టమైన సబ్జెక్టులంటూ ప్రత్యేకంగా ఏమున్నాయి? సీఏ ఫైనల్ సబ్జెక్ట్స్‌లో ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, కాస్టింగ్, డెరైక్ట్ ట్యాక్సెస్ వంటివి కొంత కష్టమని చాలామంది విద్యార్థుల అభిప్రాయం. వాటిని ఇష్టపడి ప్రాక్టికల్‌గా చదివితే బాగానే స్కోరింగ్ చేయొచ్చు. మరీ కష్టంగా అనిపిస్తే కోచింగ్ తీసుకుని ఎక్కువ స్కోర్ సాధిస్తున్నారు.
సీఏకు కోచింగ్ తప్పనిసరా? నాణ్యమైన మెటీరియల్ సాధ్యమేనా? మంచి స్కోర్ సాధించాలంటే.. కోచింగ్ అవసరమనే చెప్పాలి. గతంలో చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లకైతే ఒకరకంగా సులువే. వారు ప్రత్యేకంగా కోచింగ్‌ను ఆశ్రయించక్కర్లేదు. ప్రధానంగా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ విధానాన్ని ప్రణాళికబద్ధంగా ఫాలో అయితే ఏ ఇబ్బందీ ఉండదు. ఒకరకంగా హైస్కోరింగ్ సాధించడంలో మెటీరియల్ కీలకం. అందుకే బోర్డ్ ఆఫ్ స్టడీ నాణ్యమైన మెటీరియల్ అందిస్తోంది.
కష్టమైన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతోపాటు ఎక్కువస్కోర్ సాధించడానికి మీరిచ్చే సలహా? కష్టమైన సబ్జెక్టులను ముందు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. సావధానంగా వాటి కాన్సెప్ట్‌లను తెలుసుకోవాలి. కష్టమైన సబ్జెక్టులు ఏవో ముందుగానే విద్యార్థులు ఓ అంచనాకు రావాలి. ఎందుకంటే.. ఒక్కో విద్యార్థికి ఒక్కో సబ్జెక్టు కష్టంగా తోస్తుంది.
అందుకే ఎవరికివారు అంచనావేసుకుని దానికి అనుగుణంగా ప్రాక్టీస్‌చేస్తే పరీక్షలో ఎక్కువ స్కోరింగ్ సాధించవచ్చు. అంతేకాదు... ఎగ్జామ్‌లో ప్రశ్నలను కొంతవరకు ట్విస్టింగ్‌గా అడగడానికి అవకాశముంది. కాబట్టి ముందు సబ్జెక్ట్‌ను చదివి అర్థంచేసుకుంటే సులువుగా సమాధానాలు రాయొచ్చు.
సీఏలో ఆర్టికల్‌షిప్ ప్రాధాన్యత గురించి వివరిస్తారా? సీఏ ఫైనల్‌లో భాగంగా విద్యార్థులు ఆర్టికల్‌షిప్ పూర్తిచేయాలి. ఇది చాలాకీలకం. అప్పటివరకు పుస్తకాల్లో నేర్చుకున్న విషయాన్ని ప్రాక్టికల్‌గా అప్లై చేయడానికి ఇది మంచి అవకాశం. విద్యార్థులు వివిధ విభాగాల్లో తమకు నచ్చినవాటిల్లో ఆర్టికల్‌షిప్ చేయొచ్చు. ప్రధానంగా ఇది సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆధ్వర్యంలో ఆడిటింగ్, అకౌంటింగ్, ట్యాక్సేషన్ ఎందులోనైనా పూర్తిచేయొచ్చు.
సీఏ చదివిన వారికి జాబ్ మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది? భవిష్యత్తు అవకాశాలు? చార్టర్డ్ అకౌంటెంట్లకు అవకాశాలు పుష్కలం. ఇక్కడ కోర్సు పూర్తయిన వెంటనే ఇంజనీరింగ్, ఏంబీఏ కాలేజీల తరహాకుమించి క్యాంపస్‌ప్లేస్‌మెంట్లు జరుగుతున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఐబీఎం, విప్రో, ఎంసెంచర్, కాగ్నిజెంట్‌లతోపాటు ఎల్‌అండ్‌టీ వంటి నిర్మాణ కంపెనీలు, రెడ్డీస్‌ల్యాబ్ వంటి ఔషధ తయారీ కంపెనీలు.. ఇలా ఎన్నో రంగాలకు చెందిన సంస్థలు చార్టర్డ్ అకౌంటెంట్లకు ఏటా రూ.4 లక్షలకు పైగా శాలరీ ప్యాకేజీలు ఇవ్వడానికి ముందుకువస్తున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఏ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. అందరూ పెద్దపెద్ద కంపెనీల్లో కీలక ఉద్యోగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఐటీ, నిర్మాణ, ఔషధతయారీ, హోటల్ రంగాలు మరింత విస్తరించే అవకాశం ఉన్నందున సీఏ విద్యార్థులకు డిమాండ్ రెట్టింపవుతుంది.
సీఏ చదివినవారి కెరీర్ ఎలా ఉంటుంది? ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్లకు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. ఒక్కసారి ఈ కోర్సులో చేరి విజయవంతంగా పూర్తిచేస్తే కెరీర్‌కు ఢోకా ఉండదు. ప్రస్తుతం సీఏలకు వివిధ రంగాల నుంచి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుండడంతో.. అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కోర్సుపూర్తై ఐసీఏఐ క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్, కన్‌స్ట్రక్షన్, మెడికల్, ఇండస్ట్రీస్ ఇలా పలురకాల కంపెనీలు పోటీపోటీగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి!!
....................... |
No comments:
Post a Comment