Wednesday, June 27, 2012

అవగాహన కల్పించే గత ర్యాంకుల విశ్లేషణ..

మరి కొద్ది రోజుల్లో ఎంసెట్ ర్యాంకులు విడుదల కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్మీడియెట్‌లో మార్కుల వెయిటేజీ లెక్కింపులో బిజీగా ఉన్నారు. ఇక.. ఎంసెట్ ర్యాంకులు వెల్లడైతే.. తమకు ఏ ర్యాంకు వచ్చింది? ఏ కాలేజీలో సీటు వస్తుంది? ఏ బ్రాంచ్ మంచిది? అనే విషయాలపై ఆలోచనలు సాగించడం సహజం. అందుకే.. ఈ విషయాల్లో విద్యార్థులను ముందుగానే సన్నద్ధం చేసేలా.. రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో గత ఏడాది చివరి ర్యాంకులపై విశ్లేషణ.. 

రాష్ట్రంలో ఏడు వందలకుపైగా ఇంజనీరింగ్ కళాశాలలు.. మూడు లక్షలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇంజనీరింగ్ అంటే క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఆ కోర్సులో ప్రవేశిస్తే.. నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్ చేతిలో పడితే జీవితం సాఫీగా సాగుతుందని, భవిష్యత్తు బాగుంటుందనేదే ఆలోచన. మన రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌కు ఏటేటా పెరుగుతున్న ఆదరణే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇక.. ఎంసెట్ ర్యాంకులు విడుదలవుతున్నాయంటే విద్యార్థుల్లో ఒకవిధమైన ఆందోళన. ఏ ర్యాంకుకు ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్ లో సీటొస్తుందని లెక్కలేస్తుంటారు. 

గత ర్యాంకుల విశ్లేషణతో మార్గం:
గత ఏడాది ఆయా కాలేజీల్లో, ఆయా బ్రాంచ్‌ల్లో చివరి సీటు ఏ ర్యాంకుతో ముగిసిందనే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా విద్యార్థులు ప్రాథమికంగా తమకు లభించే బ్రాంచ్, కాలేజ్ విషయంలో ఒక అవగాహన పొందే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల వెబ్‌కౌన్సెలింగ్ సమయంలో ఆప్షన్స్ నింపే క్రమంలో... అందుబాటులో ఉన్న అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్తపడొచ్చు. తమకు వచ్చిన ర్యాంకు పరిధిలోనే మెరుగైన కళాశాలను ఎంచుకునేందుకు వీలవుతుంది.

కాలేజ్ తర్వాత.. బ్రాంచ్:
కాలేజీ విషయంలో స్పష్టత ఏర్పడ్డాక తక్షణం తలెత్తే ప్రశ్న ఏ బ్రాంచ్ మంచిది? సదరు కళాశాలలో తక్కువ ర్యాంకుతో సీట్లు భర్తీ అయిన బ్రాంచ్‌ను తెలుసుకోవడం ద్వారా ఆ నిర్దిష్ట కాలేజీలో ఏ బ్రాంచ్ మంచిదో తెలుసుకునే ఆస్కారం లభిస్తుంది. 

వన్నె తరగని బ్రాంచ్.. ఈసీఈ:

ఎన్ని వందల కళాశాలలున్నా.. ఎన్ని లక్షల సీట్లు ఉన్నా వన్నె తరగని బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. క్యాంపస్ కళాశాలలు, ఏ గ్రేడ్ ప్రైవేట్ కళాశాలలు మొదలు.. సాధారణ కళాశాలల వరకు ముందుగా సీట్లు భర్తీ అయ్యే బ్రాంచ్ ఈసీఈ కావడమే ఇందుకు నిదర్శనం. భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉపాధి పరంగా విస్తృత అవకాశాలు ఉండటం; ఆర్థిక సంక్షోభాలకు; మార్కెట్ ఒడిదుడుకులకు ఎక్కువగా గురికాని ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో అవకాశాలు లభించడమే ఇందుకు కారణం. 

సాఫ్ట్‌వేర్‌కు రూట్.. సీఎస్‌ఈ:

సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు మార్గం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సాఫ్ట్‌వేర్ రంగంలో అవసరమైన అప్లికేషన్స్, ప్రోగ్రాం డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ఈ కోర్సు ద్వారా శిక్షణ పొందొచ్చు.

నిర్మాణ రంగంలో భవిష్యత్తుకు సివిల్:
నిర్మాణ రంగంలో భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు సరైన వేదిక సివిల్ ఇంజనీరింగ్. అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు రంగం మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో సివిల్ ఇంజనీరింగ్‌కు చక్కటి భవిష్యత్తు ఉందనేది నిస్సందేహం. ఈ విభాగంలో అధిక శాతం విధులు క్షేత్రస్థాయిలో ఉంటాయి. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ ఎంచుకునే విద్యార్థులకు ఆ మేరకు శారీరక సన్నద్ధత అవసరం. 

ఈసీఈ తర్వాత స్థానం ఈఈఈ:
ఈసీఈ తర్వాత అత్యధిక శాతం విద్యార్థులు ఆసక్తి చూపుతున్న బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ). ఎలక్ట్రికల్ రంగంతోపాటు ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ భవిష్యత్తులో అవకాశాలు లభించడమూ మరో కారణం. ఇటీవల కాలంలో ప్రైవేటు సంస్థలతోపాటు పబ్లిక్ సెక్టార్ సంస్థలు కూడా బీటెక్(ఈఈఈ) విద్యార్థులను భారీస్థాయిలో ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. అందుకే ఈఈఈని కూడా బెటర్ ఆప్షన్‌గా పేర్కొనొచ్చు.

మెకానికల్.. మెరుగవుతున్న జాబ్స్:

గత దశాబ్దం వరకు మెకానికల్ ఇంజనీరింగ్‌కు అవకాశాలు పరిమితం అని చెప్పొచ్చు. కానీ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం విస్తరించడం, పలు విదేశీ సంస్థల ప్రవేశంతో మెకానికల్ పట్టభద్రులకు కూడా మెండైన అవకాశాలు లభిస్తున్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఏఎల్, డీఆర్‌డీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ట్రైనీగా అడుగుపెట్టి కెరీర్ ప్రారంభించవచ్చు. 

No comments:

Post a Comment