Friday, August 3, 2012

ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే?

యూఎస్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేయాలనుకుంటున్నాను? వివరాలు తెలపండి?
- లక్ష్య, హైదరాబాద్.
యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే ముందుగా అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. సంబంధిత ప్రిపరేషన్‌ను దాదాపుగా ఏడాదిన్నర ముందుగానే ప్రారంభించాలి. ఈక్రమంలో అక్కడి యూనివర్సిటీలు, వాటి అడ్మిషన్ ప్రక్రియను తెలుసుకోవాలి. సాధారణంగా ఏ దేశంలోనైనా అడ్మిషన్ విధానం ఏ రెండు ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య ఒకే మాదిరిగా ఉండదు. ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయి, ప-ర్వ చరిత్ర ఆధారంగా నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి యూఎస్‌లో ఏరోనాటికల్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు, అడ్మిషన్ కోసం అవి పాటించే ప్రమాణాలను తెలుసుకోవాలి. ఈ క్రమంలో దాదాపు 10 నుంచి 12 టాప్ యూనివర్సిటీలను షార్ట్‌లిస్ట్ చేసుకోవాలి. విద్యార్థులు తాము ఎంచుకున్న కళాశాలలతో ఏడాది ముందుగా సంప్రదింపులు మొదలు పెట్టాలి. కోర్సు అప్లికేషన్, ఇతర సమాచారం కోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ సమయంలోనే వినతి పత్రాలు సమర్పించాలి.

ఆ సమాచారం పొందాక.. రికమెండేషన్ లెటర్లు సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యమైన దశ. ఇందుకోసం విద్యార్థులు తమకు బాగా తెలిసిన ప్రొఫెసర్లు లేదా ప్రొఫెషనల్స్‌ను సంప్రదించడం మంచిది. దీంతోపాటు తాము చదువుతున్న విద్యా సంస్థల నుంచి సంబంధిత డాక్యుమెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా ప్రతి ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ సమయానికి 4,5 నెలల ముందే తుది జాబితా రూపొందిస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులకు సమాచారం కూడా పంపుతుంది. ప్రవేశం కల్పించిన ఇన్‌స్టిట్యూట్‌లు అందించే ఐ-20 ఫామ్‌తో వీసా కోసం దరఖాస్తు చేయాలి. ఇందుకోసం సంబంధిత కాన్సులేట్ లేదా ఎంబసీ అధికారుల్ని సంప్రదించాలి. దరఖాస్తు సమయంలోనే.. అందుబాటులో ఉన్న తేదీల్లో తమకు అనుకూలమైన తేదీలను వీసా ఇంటర్వ్యూ కోసం ఎంచుకోవడం మంచిది.

యూఎస్‌లో దాదాపు అన్ని యూనివర్సిటీలు టోఫెల్/ జీఆర్‌ఈ స్కోర్ ఆధారంగా ఎంఎస్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు చివరి సంవత్సరంలోనే ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. అలా కాకుండా మూడో సంవత్సరంలోనే వీటిని ప-ర్తి చేసుకోవడం మంచిది. ఒకవేళ మొదట్లో నిరాశపరిచే ఫలితాలు వచ్చినా సరిదిద్దుకునే వీలుంటుంది. అంతేకాకుండా.. చివరి సంవత్సరంలో ఉండే ప్రాజెక్ట్ వర్క్ ఒత్తిడివల్ల ఈ పరీక్షలకు ప్రిపేరయ్యే సమయం లభించకపోవచ్చు.

ఉపయోగపడే వెబ్‌సైట్లు:
www.msinus.com
http://studyusa.com
www.vfsusa.co.in
www.studyusa.in
www.usnews.com

ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలను తెలపండి?
- వర్థన్, కరీంనగర్.
ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించడానికి రెండు మార్గాలు.. ఒకటి ఆర్మ్‌డ్‌ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేయడం, ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా ఆర్మీలో డాక్టర్ చేరడం. ఆర్మీలో డాక్టర్‌గా సేవలు అందించడానికి వేదికగా నిలుస్తోంది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(ఏఎఫ్‌ఎంసీ)-పుణే. ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ చేయడం ద్వారా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఎంబీబీఎస్‌లో ప్రవేశం కోసం ఏఎఫ్‌ఎంసీ జాతీయ స్థాయిలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఏఎఫ్‌ఎంసీలో ప్రవేశానికి ప్రతి ఏటా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఏటా 130 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఎంట్రెన్స్ టెస్ట్ 200 ప్రశ్నలకు, 200 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఇందుకోసం 2 గంటల సమయం కేటాయిస్తారు. బయాలజీ (బోటనీ, జువాలజీలను కలిపి), ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్‌లపై 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌లపై 25 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులకు తర్వాతి దశల్లో ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది.

వీటి ఆధారంగా సీటు ఖరారు చేస్తారు. సంబంధిత నోటిఫికేషన్ జనవరి/ఫిబ్రవరిలలో వెలువడుతుంది. పరీక్ష మే నెలలో ఉంటుంది.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత. భారతీయులై ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి.
కనీస వయసు: 17 సంవత్సరాలు, గరిష్ట వయసు: 22 సంవత్సరాలు మించకూడదు.
ఏఎఫ్‌ఎంసీ కాకుండా.. ఆర్మీ నేరుగా విడుదల చేసే ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ కాప్స్‌ను రిక్రూట్ చేసుకుంటుంది. ఈ విధంగా కూడా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. సంబంధిత నోటిఫికేషన్ల కోసం ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ లేదా ఆర్మీ వెబ్‌సైట్ చూడొచ్చు.
వివరాలకు: htpp://afmc.nic.in,
htpp://indianarmy.nic.in

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ మెట్రిక్ లెవల్ పరీక్షకు సంబంధించిన వివరాలు తెలపండి?
- కృష్ణ, విజయవాడ.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. దేశ వ్యాప్తంగా నిర్వహించే కంబైన్డ్ మెట్రిక్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్లు గ్రేడ్-‘సి’, గ్రేడ్-‘డి’, లోయర్ డివిజన్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ ఎగ్జామ్‌ను ‘హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్’గా పేరు మార్చారు. ఈ పరీక్ష ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సీవీసీ, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కస్టమ్స్‌తోపాటు పలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ఆఫీసులలో గ్రేడ్-‘సి’, గ్రేడ్-‘డి’, లోయర్ డివిజన్ క్లర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ ఉంటుంది.

అర్హతలు: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్లు. రిజర్‌‌వడ్ అభ్యర్థులకు నిబంధనలమేరకు వయోసడలింపు ఉంటుంది. రెండు దశల్లో.. ఎంపిక ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో జనరల్ ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి రెండో దశలో పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా మెరిట్‌లిస్ట్ రూపొందిస్తారు. దాని ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు.
వివరాలకు:htpp://ssc.nic.in

No comments:

Post a Comment