దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో హార్టికల్చర్ ఒకటి. దేశానికి జీడీపీని సమకూర్చిపెట్టడంలో ఉద్యాన, సంబంధిత పంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వివిధ బహుళజాతి సంస్థలు కూడా భారీ ఎత్తున వ్యవసాయ క్షేత్రాల్లో ఉద్యానపంటలను సాగు చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న శ్రద్ధ.. నాణ్యమైన కూరగాయలపై పెరుగుతున్న మక్కువ వంటి కారణాలతో.. ఈ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దీన్ని గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే రెండో హార్టికల్చర్ యూనివర్సిటీని 2007లో పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెంలో నెలకొల్పింది. ఈ యూనివర్సిటీలో వివిధ కోర్సులు న్నాయి.
కోర్సులు: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్:
వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: ఎంసెట్ ద్వారా
సీట్ల సంఖ్య: 4 కాలేజీల్లో మొత్తం 230.
ఉన్నత విద్య: బీఎస్సీ హార్టికల్చర్ ఉత్తీర్ణులు ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ హార్టికల్చర్ కోర్సులు అభ్యసించొచ్చు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీతో పాటు వివిధ రాష్ట్రాల్లో అనేక వర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.
ఉద్యోగావకాశాలు:
కోర్సులు పూర్తిచేసుకున్నవారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టెక్నికల్, ప్రొబేషనరీ ఆఫీసర్లుగా ఉద్యోగాలు లభిస్తాయి. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యాన విభాగాల్లో హార్టికల్చరల్ ఆఫీసర్లుగా అవకాశాలు లభిస్తాయి. వివిధ ప్రైవేటు సంస్థలు, నర్సరీలు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో హార్టికల్చర్ కన్సల్టెంట్స్‌గా కూడా సేవలు అందించొచ్చు. సొంతంగా హార్టి క్లినిక్స్, ఉద్యాన వ్యాపార కేంద్రాలను నిర్వహించుకోవచ్చు. వివిధ ఎరువులు, రసాయనాలు, విత్తనాల కంపెనీల్లో టెక్నికల్ ఆఫీసర్లు లేదా మార్కెటింగ్ ఆఫీసర్లుగా పనిచేస్తూ నెలకు రూ.30000 వరకు సంపాదించొచ్చు.
వెబ్‌సైట్: drysrhu.edu.in
బ్యాంకులు మొదలు.. బహుళ జాతి సంస్థల వరకు
ఇటీవల కాలంలో ప్రాధాన్యత సంతరించుకుంటున్న కోర్సు హార్టికల్చర్. ప్రస్తుతం మన రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్.ఆర్. హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో నాలుగు కళాశాలల్లో 230 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది శాతం సీట్లను హార్టికల్చర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులకు, మరో పదిహేను శాతం సీట్లను జాతీయ స్థాయిలో నిర్వహించే ఐసీఏఆర్ ర్యాంకర్లకు కేటాయిస్తున్నాం. ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగానూ ఎన్నో అవకాశాలున్న కోర్సు బీఎస్సీ హార్టికల్చర్. దీని తర్వాత ఎమ్మెస్సీ చేయొచ్చు. అంతేకాకుండా ఐసీఏఆర్ నిర్వహించే జేఆర్‌ఎఫ్‌లో 50 లోపు ర్యాంకు పొందితే పరిశోధన సౌకర్యంతోపాటు నెలకు రూ. 8 వేల ఫెలోషిప్ కూడా లభిస్తుంది. ఇక.. కెరీర్ పరంగా బ్యాంకులు ప్రధాన వేదికలుగా నిలుస్తున్నాయి. హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లను ఫస్ట్ గ్రేడ్ హోదాలో రూరల్ డెవలప్‌మెంట్ అధికారులుగా నియమిస్తున్నాయి. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్‌లో క్రాప్ కోఆర్డినేటర్స్, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో అధికారులుగా చేరే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిలైజర్ సంస్థలు ప్రధానమైన ఉపాధి వేదికలు. అంతేకాకుండా బీఎస్సీ పూర్తి చేస్తే మా యూనివర్సిటీలోనే పాలిటెక్నిక్ లెక్చరర్స్‌గా నియమిస్తున్నాం. ఏ రంగమైనా ప్రారంభంలో రూ. 25 వేల జీతం ఖాయం. ఇలా.. ఎన్ని కోణాల్లో చూసినా.. బీఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేస్తే ‘ఖాళీగా ఉంటాం’ అనే ప్రసక్తే ఉండదు.
అగ్రికల్చర్
మన దేశం పారిశ్రామికంగా శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ దేశ జనాభాలో సగం మందికిపైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగంలో పంటలకు వచ్చే వివిధ చీడపీడల నివారణ, వివిధ రుతువులకనుగుణంగా పంటల సాగు, అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాల తయారీ, రైతులకు వివిధ అంశాలపై అవగాహన కలిగించడం వంటి విషయాల్లో నిష్ణాతుల అవసరం ఉంటోంది. ఈ నేపథ్యంలో వివిధ యూనివర్సిటీలు పాలిటెక్నిక్, బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో అగ్రికల్చర్ కోర్సులను అందిస్తున్నాయి.
బీఎస్సీ అగ్రికల్చర్:
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 8 కాలేజీల్లో మొత్తం 620.
బీటెక్ అగ్రి ఇంజనీరింగ్:
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: ఎంసెట్ ద్వారా
సీట్ల సంఖ్య: 3 కాలేజీల్లో మొత్తం 90.
ఉన్నత విద్య: బీఎస్సీ పూర్తయ్యాక ఎంఎస్సీ (అగ్రి)లో చేరొచ్చు. తర్వాత పీహెచ్‌డీ చేయొచ్చు.
ఉద్యోగావకాశాలు:
అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్లు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లుగా చేరొచ్చు. మోన్‌శాంటో, బేయర్ వంటి విత్తన, ఫర్టిలైజర్ కంపెనీల్లో టెక్నికల్ ఆఫీసర్లుగా ఉద్యోగాలుంటాయి. దాంతోపాటు టీ గార్డెన్‌లు, రబ్బర్ ప్లాంటేషన్‌లలోనూ అవకాశాలు లభిస్తాయి. ఎంఎస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసుకుంటే పరిశోధన రంగంలోనూ తిరుగుండదు. అంతేకాకుండా ఏఎస్‌ఆర్‌బీ పరీక్ష ద్వారా అగ్రికల్చర్ సైంటిస్ట్‌లుగా స్థిరపడొచ్చు లేదా ఏఆర్‌ఎస్-నెట్ ద్వారా వివిధ వర్సిటీలు, కళాశాలల్లో లెక్చరర్, ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించవచ్చు. అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్‌లు, ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్, అగ్రి-బయోటెక్ సంస్థలు, కమర్షియల్ ఫార్మింగ్‌లో కూడా ఉద్యోగావకాశాలు పుష్కలం.
వెబ్‌సైట్: angrau.ac.in
అప్‌కమింగ్ బ్రాంచ్
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం క్లిష్టంగా మారడంతో టెక్నాలజీ ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అప్‌కమింగ్ బ్రాంచ్‌గా వెలుగులీనుతోంది. కోర్సు ద్వారా భూ ఉత్పాదకత పెంచడమే ప్రధానోద్దేశం. ప్రస్తుతం మన రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో (బాపట్ల, మడకశిర, సంగారెడ్డి) ఉన్న కళాశాలల్లో అందిస్తున్న ఈ కోర్సు ఎంతో క్రేజీగా మారుతోంది. ఉద్యోగాల పరంగా వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీర్లకు పెద్దపీట వేస్తున్నారు. ప్రైవేటు రంగంలో వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు ఉత్పత్తి చేసే సంస్థలు, మైక్రో ఇరిగేషన్ సంస్థలు, డైరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
మన రాష్ట్రంలో ఏటా 400 మంది అగ్రికల్చర్ ఇంజనీర్ల అవసరం ఏర్పడుతోందని ఒక అంచనా. కానీ బయటికి వస్తున్న విద్యార్థుల సంఖ్య మాత్రం 150. దీన్నిబట్టే ఉద్యోగాల పరంగా డిమాండ్-సప్లయ్ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవచ్చు. వేతనాల పరంగా ప్రారంభంలో సగటున రూ. 25 వేల జీతం అందుకోవచ్చు.
గత ఏడాది మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ నెలకు రూ. 40 వేల వేతనం అందించింది. ఉన్నత విద్యా కోణంలోనూ పీజీ, పీహెచ్‌డీ చేయొచ్చు. మన రాష్ట్రంలో బాపట్ల అగ్రికల్చరల్ కళాశాలలో ఫార్మ్ మెషినరీ అండ్ పవర్, సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్, ప్రాసెస్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ అందుబాటులో ఉన్నాయి.
హోమ్ సైన్స్
మారుతున్న పరిసరాలకనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడం కోసం గత కొంత కాలంగా సైన్స్ విభాగంలో ఎన్నో కొత్త కోర్సుల ఆవిర్భావం జరిగింది. అలాంటి వాటిల్లో ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన కోర్సుల్లో హోమ్ సైన్స్ ఒకటి.
హోమ్ సైన్స్ అంటే:
గృహ, కుటుంబ జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చుదిద్దుకోవడం కోసం రూపొందించిన కోర్సు హోమ్ సైన్స్. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను అవగాహన చేసుకోవడం, వాటికి శాస్త్రీయ దృక్ఫథంతో పరిష్కారాలను కనుక్కోవడం వంటి అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. అంతేకాకుండా మారుతున్న జీవన విధానానికి తగ్గట్టు విద్యార్థినులను తీర్చిదిద్దడమే కాకుండా వారికి జీవనోపాధిని కల్పించే విధంగా కోర్సు రూపకల్పన ఉంటుంది.
కేవలం మహిళలకే:
ఈ కోర్సుకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. నాలుగేళ్ల కోర్సులో.. మొదటి రెండేళ్లు ఐదు సబ్జెకులు కామన్‌గా ఉంటాయి. మూడో ఏడాది నుంచి ఏదో ఒక స్పెషలైజేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అవి..
* ఫుడ్ అండ్ న్యూట్రిషన్
* ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్
* హోమ్ సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్
* హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్
* టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్ డిజైనింగ్
అవకాశాలు:
కోర్సు పూర్తి చేసిన వారికి ప్రొడక్షన్ ఇండస్ట్రీ, టూరిజం, సర్వీస్ సెక్టార్, డాబర్ వంటి ఫుడ్ మేకింగ్ పరిశ్రమలు, ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర రంగాల్లో.. వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. పరిశోధన రంగంలో రీసెర్చ్ అసోసియేట్, ఫుడ్ సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసి సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా కూడా చేరొచ్చు. రీసెర్చ్ అనలిస్ట్, న్యూట్రిషన్ కన్సల్టెంట్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే.. సివిల్స్, గ్రూప్-1,2 వంటి అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.
వేతనాలు:
బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి 20 వేల వరకు వేతనం లభిస్తుంది. చదువు, అనుభవం ఆధారంగా తర్వాత నెలకు రూ.40 వేల వరకు సంపాదించవచ్చు.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
మన రాష్ట్రంలో కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ (ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ)-సైఫాబాద్, హైదరాబాద్ మాత్రమే బీఎస్సీ (ఆనర్స్-హోమ్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది.
సీట్ల సంఖ్య: 100
అర్హత:
ఫిజికల్ సెన్సైస్, బయాలజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్‌లలో ఏదేని ఒక కాంబినేషన్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. పల్లెల్లో పదో తరగతి వరకూ చదివి, కనీసం మూడు ఎకరాల పొలం ఉన్న రైతుల సంతానానికి
‘రైతుల కోటా’లో 40 శాతం సీట్లను కేటాయిస్తారు.
ప్రవేశం: మెరిట్ ఆధారంగా.
వివరాలకు: www.angrau.net
ఉన్నత విద్య:
బ్యాచిలర్ డిగ్రీ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్స్‌తో పీజీ కోర్సులను చదివే అవకాశం ఉంది. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. ఈ క్రమంలో ఉండే స్పెషలైజేషన్లు..
పీజీ:
* న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్
* అపెరల్స్ అండ్ టెక్స్‌టైల్స్
* చైల్డ్ గెడైన్స్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్
* ఇంటీరియర్ డిజైన్
ఎంఎస్సీ(హోమ్ సెన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
* } వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి.
వెబ్‌సైట్: www.svuniversity.in
* ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.angrau.net
* } సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్- అనంతపూర్ క్యాంపస్.
వెబ్‌సైట్: http://sssihl.edu.in
పీహెచ్‌డీ స్పెషలైజేషన్స్:
* ఫుడ్ అండ్ న్యూట్రిషన్
* హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్
* రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ క న్జ్యూమర్ సెన్సైస్
* అపెరల్ అండ్ టెక్స్‌టైల్స్
* ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్
అద్భుత అవకాశాలు
బీఎస్సీ హోమ్ సైన్స్‌లో ప్రస్తుతం అయిదు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. అపరెల్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఈసీసీడీ, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఇంటీరియర్ అండ్ ఎక్స్‌ట్రీరియర్ స్పేస్ డిజైన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే కోర్సు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ లభించడం బీఎస్సీ హోమ్ సైన్స్ ప్రత్యేకత. ప్రస్తుతం సైఫాబాద్ (హైదరాబాద్)లోని కాలేజ్‌లో 100 సీట్లతో మాత్రమే ఆఫర్ చేస్తున్న ఈ కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి గుంటూరులో కూడా ప్రారంభించనున్నాం. ఇక ఉన్నత విద్య పరంగా ఎమ్మెస్సీ స్థాయిలో ఏడు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణుల కోసం ఉద్యోగాల పరంగా డిమాండ్, సప్లయ్ వ్యత్యాసం దాదాపు 60-40 గా కొనసాగుతోంది. బీఎస్సీ ఉత్తీర్ణులు ప్రారంభంలోనే రూ. 20 వేల జీతం అందుకోవ చ్చు. పీజీ పూర్తి చేస్తే టీచింగ్, రీసెర్చ్ ఫెలోషిప్ అవకాశాలు పుష్కలం. యూజీ స్థాయిలో ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఉదాహరణకు న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ స్పెషలైజేషన్‌తో డైటీషియన్స్‌గా స్థిరపడొచ్చు. ప్రభుత్వ రంగంలో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి.
No comments:
Post a Comment