సీఏ
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహిస్తుంది.
* అర్హత: ఇంటర్మీడియెట్.
సీఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి..
* కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ)
* ఐపీసీసీ
* ఫైనల్ కోర్స్
‘పది’తో సీపీటీకి:
సీఏ కోర్సులో చేరడానికి తొలి దశ కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్. ఇది పూర్తి స్థాయి కోర్సుకి ఒక అర్హత పరీక్ష వంటిదని చెప్పొచ్చు. సీఏ భవిష్యత్తుగా ఎంచుకోవాలనుకునే ప్రతి విద్యార్థి ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సిందే. దీనికోసం పదో తరగతి పూర్తి కాగానే ఐసీఏఐలో పేరు నమోదు చేసుకోవాలి. ఇలా పేరు నమోదు చేసుకున్న విద్యార్థులు తమ ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక మాత్రమే సీపీటీకి హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. ఇందుకోసం ఇంటర్మీడియెట్ పరీక్షలు రాశాక దరఖాస్తు చేసుకోవాలి. సీపీటీ ప్రతి ఏటా రెండుసార్లు (జూన్/డిసెంబర్) జరుగుతుంది. వీటికి హాజరుకావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి, సీపీటీకి మధ్య రెండు నెలల వ్యవధి తప్పనిసరి. అంటే జూన్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే ఏప్రిల్ ఒకటో తేదీలోపు; డిసెంబర్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే అక్టోబర్ ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సిలబస్:
సీపీటీ పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు సెషన్‌లు.. సెషన్-1, సెషన్-2గా ఉంటుంది. సెషన్-1లో సెక్షన్-ఎ (ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ - 60 మార్కులు), సెక్షన్-బి (మర్కెంటైల్‌లా- 40 మార్కులు); సెషన్‌లో-2లో సెక్షన్-సి (జనరల్ ఎకనామిక్స్- 50 మార్కులు), సెక్షన్-డి (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 మార్కులు) ఉంటాయి. పరీక్ష వ్యవధి: ఒక్కో సెషన్‌కు రెండు గంటలు.
ఐపీసీసీ:
కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సీపీటీ)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఏ కోర్సు క్రమంలో ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపీసీసీ) కోసం పేరు నమోదు చేసుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులు.. గ్రూప్-1, గ్రూప్-2గా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా పేరు నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల పాటు ఉండే స్టడీ కోర్సును పూర్తి చేయాలి. దీంతోపాటు 35 గంటల వ్యవధిలో సాగే ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. వీటిని పూర్తి చేసిన వారికి మాత్రమే ఐపీసీసీలోని గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది.
ఫైనల్.. ముందే ఆర్టికల్ ట్రైనింగ్:
ఐపీసీసీలోని రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఏ ఫైనల్ కోర్సులోకి అనుమతి లభిస్తుంది. అయితే దీనికంటే ముందుగా ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ఆర్టికల్‌షిప్ (ఆర్టికల్డ్ అసిస్టెంట్‌గా) కోసం పేరు నమోదు చేసుకోవాలి. ఐపీసీసీ మొదటి గ్రూప్ ఉత్తీర్ణత పొందిన వెంటనే కూడా ఆర్టికల్‌షిప్‌లో చేరొచ్చు. ఐసీఏఐ గుర్తింపు ఉన్న సీఏ దగ్గర ఈ ఆర్టికల్‌షిప్ చేయాలి. వ్యవధి మూడేళ్లు. ఆర్టికల్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని ఆధారంగా సీఏ ఫైనల్ కోర్సు కోసం పేరు నమోదు చేసుకోవాలి. సీఏ ఫైనల్ కోర్సు చదువుతూ, ఆర్టికల్‌షిప్ చివరి 12 నెలల సమయంలో.. 15 రోజుల జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల ఆర్టికల్‌షిప్ పూర్తి చేసిన తర్వాత లేదా ఆర్టికల్‌షిప్ చివరి ఆరు నెలల సమయంలో ఉన్నప్పుడు ఫైనల్ కోర్సు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పూర్తిస్థాయి సీఏ గుర్తింపు లభించినట్లే.
సీఏ ఫైనల్:
పూర్తి స్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా తీర్చిదిద్దే ఫైనల్ కోర్సు కూడా రెండు గ్రూపులుగా ఉంటుంది. ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి.
కెరీర్ ఆప్షన్స్:
సీఏ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పలు కార్పొరేట్ సంస్థలు ఐసీఏఐ బ్రాంచ్‌లలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. సీఏ కోర్సు పూర్తి చేసిన వారికి సేవా రంగం, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, వివిధ పరిశ్రమలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. అంతేకాకుండా టైర్-3 పట్టణాల్లోని రిటైల్ షాపులు, జ్యువెలరీ, వస్త్ర, తదితర వాణిజ్య సంస్థల ఆదాయవ్యయాలు, లాభనష్టాలు.. ఇలా ప్రతి దశలోనూ సీఏలతో సంస్థాగత ఆడిటింగ్ నిర్వహించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సీఏల అవసరం భారీ స్థాయిలో ఉంటోంది.
వేతనాలు:
సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు రూ. 35,000 నుంచి రూ.50,000వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు రూ. 10 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు.
డిగ్రీతో నేరుగా:
తాజా మార్పుల ప్రకారం- డిగ్రీ లేదా పీజీలో 55 శాతం మార్కులు సాధించిన కామర్స్ గ్రాడ్యుయేట్లు లేదా డిగ్రీ/పీజీలో 60 శాతం మార్కులు ఉన్న నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్లు లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు సీపీటీ నుంచి మినహాయింపనిచ్చారు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు. ఐసీఏఐ ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అని భావిస్తే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తి చేసి, ఒక ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్‌తో అకౌంటెంట్‌గా నెలకు రూ. 25,000 వేతనం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.icai.org
ప్రాక్టికల్ దృక్పథంతో
మూడు దశల సీఏ కోర్సులో ఇంటర్మీడియెట్ అర్హతతో కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉత్తీర్ణత సాధించి ఫౌండేషన్ కోర్సులో చేరొచ్చు. ఇలా ఇంటర్మీడియెట్ తర్వాత ఫౌండేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు చేయూతనిచ్చే విధంగా ఇగ్నో, భారతీయార్, నేతాజీ సుభాష్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుని దూరవిద్యా విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నాం. దీని ద్వారా విద్యార్థులకు మూడేళ్ల సమయం కలిసిరావడంతోపాటు సీఏ కోర్సును సరైన సమయంలో పూర్తి చేయడానికి వీలవుతుంది. ఫలితంగా 21, 22 ఏళ్ల వయసు వచ్చే సరికి సదరు విద్యార్థులు పరిపూర్ణ సీఏలుగా రూపుదిద్దుకుంటారు. సీఏ ఫైనల్ పూర్తి చేసిన వారికి సగటున రూ. 5 లక్షల వార్షిక వేతనం గ్యారెంటీ. గత ఏడాది ఐటీసీ సంస్థ అధికంగా రూ. 13 లక్షల వార్షిక వేతనం అందించింది. ప్రస్తుతం సీఏ అభ్యర్థుల కొరత పరిశ్రమలను వేధిస్తోంది. సీఏ కోర్సులో రాణించాలంటే నిరంతర ప్రాక్టీస్, సహనం, మారే చట్టాలపై అప్‌డేట్ కావాల్సి ఉంటుంది. విదేశీ అవకాశాలపరంగా ప్రస్తుతం ఐసీఏఐ ఆస్ట్రేలియా, కెనడా, యూకే తదితర పది దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల అక్కడి నియంత్రణ సంస్థలు నిర్వహించే కొన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధిస్తే ఆయా దేశాల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
సీఎంఏ
అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.
అర్హత: ఇంటర్మీడియెట్.
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి..
* ఫౌండేషన్ కోర్సు
* ఇంటర్మీడియెట్ కోర్సు
* ఫైనల్ కోర్సు
ఫౌండేషన్ కోర్సు:
కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ కోర్సు క్రమంలో తొలి దశ ఫౌండేషన్ కోర్సు. ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. జూన్‌లో జరిగే పరీక్షలకు హాజరవ్వాలనుకుంటే అంతకుముందు సంవత్సరం డిసెంబర్ 5వ తేదీలోపు, డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు హాజరవ్వాలనుకుంటే అదే సంవత్సరం జూన్ 5వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి.
ఇంటర్మీడియెట్ కోర్సు:
సీఎంఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణులు లేదా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఇంటర్మీడియెట్ కోర్సుకు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి స్టేజ్‌లో మూడు పేపర్లుంటాయి. ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు జూన్ 5వ తేదీలోపు; జూన్‌లో జరిగే పరీక్షలకు అంతకు ముందు సంవత్సరం డిసెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఫైనల్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు స్టేజ్‌లలో (స్టేజ్ -3, 4) ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు స్టేజ్‌లలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండు స్టేజ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్‌లలో) నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన దరఖాస్తు తేదీల క్రమం కూడా.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్ కోర్సుల మాదిరిగానే ఉంటుంది.
ఉన్నత విద్య:
సీఎంఏ కోర్సుకు కూడా ప్రభుత్వం గ్రాడ్యుయేషన్‌తో సమానమైన గుర్తింపునిచ్చింది. ఈ నేపథ్యంలో కామర్‌స, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ తదితర అకౌంటింగ్ సంబంధిత కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఉండే అన్ని ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశించొచ్చు. అదే అర్హతతో నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా హాజరు కావచ్చు.
ఇగ్నో సంయుక్త కోర్సులు:
10+2 తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతో ఫౌండేషన్ కోర్సులో ప్రవేశించిన విద్యార్థుల సౌలభ్యం కోసం ఇన్‌స్టిట్యూట్.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్), అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఇంటర్మీడియెట్ కోర్సులో నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం ఎంకాం (మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్) అనే రెండు స్థాయిల స్పెషలైజ్డ్ కోర్సులను అందిస్తోంది.
కావల్సిన నైపుణ్యాలు:
కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ ప్రధాన లక్ష్యం వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో ఎదురయ్యే ఖర్చులను.. నిర్ణీత ఉత్పత్తి లక్ష్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా తగ్గించడం. అంటే ఒకవైపు వస్తువుల ఉత్పత్తి సాఫీగా సాగాలి. మరోవైపు ఖర్చులు తగ్గాలి. ఇలాంటి బాధ్యతను నిర్వర్తించాలంటే లెక్కల చిక్కుముడులను ఇట్టే విప్పే నైపుణ్యం కావాలి. ఇందుకోసం లెక్కల నిర్వహణకు ఎక్కువ సమయం గడిపే విధంగా సహనం అలవర్చుకోవాలి. అనలిటికల్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియంటెడ్‌గా చదవగలగడం, మ్యాథమెటిక్స్‌పై పట్టు, వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల నేర్పు చాలా అవసరం.
కెరీర్ ఆప్షన్‌స:
సీఎంఏ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు కొదవే ఉండదు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, మైనింగ్ సంస్థలు, డెవలప్‌మెంట్ ఏజెన్సీలు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెక్టర్, ఇతర పారిశ్రామిక సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. ఆతర్వాత ప్రతిభ ఆధారంగా సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ కమ్ చైర్మన్ స్థాయికి చేరుకోవచ్చు. సీఎంఏ ఫైనల్ వరకు వేచిచూడకుండా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో కూడా పలు ఉద్యోగావకాశాలు చేజిక్కించుకోవచ్చు. ముఖ్యంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మైనింగ్ సంస్థలు సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులను ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. అన్నిటికంటే ముఖ్య విషయం భారత ప్రభుత్వం.. ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఐసీఎంఏఐలో ఫైనల్ పూర్తి చేసిన వారికి కేంద్ర సర్వీసులో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సొంతంగా కూడా కాస్ట్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
వేతనాలు:
ప్రారంభంలో ఏడాదికి రూ. 6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు.
వెబ్‌సైట్: http://icmai.in
కోర్సుకు కొత్త రూపు
గతంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాగా ఉండే ఇన్‌స్టిట్యూట్ పేరును ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అదే విధంగా సంస్థ అందించే కోర్సు పేరును కూడా కొత్తగా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీగా మార్చారు. ఇలా ఇన్‌స్టిట్యూట్, కోర్సు రూపు మార్చడంతోపాటు ఈ కోర్సుకు ప్రాముఖ్యత పెంచుతూ కంపెనీస్ యాక్ట్ కొత్త బిల్లు అనేక చర్యలు చేపట్టింది. సీఏ మాదిరిగానే సీఎంఏ ఉత్తీర్ణులు కూడా ఇంటర్నల్ ఆడిట్ చేసే అవకాశం కల్పించింది. అదే విధంగా త్వరలో రూపొందించనున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం, సంబంధిత రిటర్న్స్‌ను కాస్ట్ అకౌంటెంట్స్ ధ్రువీకరించడం తప్పనిసరి. అంతేకాకుండా కాస్ట్ ఆడిట్, కాస్ట్ కంప్లయన్స్‌ను తప్పనిసరి చేశారు. ఇలా పలు రకాలుగా కాస్ట్ అకౌంటెంట్ల పాత్ర భవిష్యత్తులో విస్తృతం కానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ తర్వాతే ఫౌండేషన్ కోర్సులో అడుగుపెట్టి సమాంతరంగా ఈ కోర్సులోని దశలను, దూర విద్యా విధానంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సును పూర్తి చేసుకుంటే ఒకే సమయంలో రెండు ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు అయిదు లక్షల మంది కాస్ట్ అకౌంటెంట్ల అవసరం ఉంది. ప్రారంభంలో రూ. 30 వేల జీతంతో కెరీర్ మొదలు పెట్టొచ్చు. ఆ తర్వాత అనుభవం ఆధారంగా సీఎఫ్‌ఓ, సీఈఓ స్థాయికి కూడా చేరుకోవచ్చు.
No comments:
Post a Comment