Tuesday, April 9, 2013

‘లా’


నేటి కార్పొరేట్ సంస్కృతి ఎన్నో వృత్తులకు సరికొత్త దిశా నిర్దేశం చేసింది.. అలాంటి కోర్సుల్లో ‘లా (న్యాయశాస్త్రం)’ ఒకటి.. గతంలో మాదిరిగా కేవలం కోర్టు వ్యవహారాలకు, టీచింగ్ రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. విస్తృత దృక్పథంతో విశ్లేషిస్తే.. సంస్కరణల యుగంలో.. ఆర్థిక సరళీకరణలు.. విదేశీ పెట్టుబడుల రాక, తదనుగుణంగా చోటు చేసుకుంటున్న పరిమాణాల నేపథ్యంలో.. ‘లా’ అభ్యర్థులకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో ‘లా’ కెరీర్‌పై సమగ్ర విశ్లేషణ..

‘లా’లో చేరాలంటే:
‘లా’ కోర్సులో చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి.. ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక ఐదేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సులో అడుగు పెట్టడం. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సులో ప్రవేశం పొందడం. ఈ క్రమంలో జాతీయ, రాష్ర్ట స్థాయిలో నిర్వహించే పలు రకాల ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వాటి వివరాలు..

లాసెట్:
రాష్ట్రంలో న్యాయ విద్యనభ్యసించడానికి వీలు కల్పించే పరీక్ష లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్). మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో లాసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశం పొందొచ్చు.

ఐదేళ్ల లా కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు: 30
సీట్ల సంఖ్య: 2700

అర్హత: ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (10+2 విధానంలో) (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి). మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.

పరీక్ష విధానం: గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు, పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌పై 30 ప్రశ్నలు, పార్ట్-సిలో లా ఆప్టిట్యూడ్‌పై 60 ప్రశ్నలుంటాయి. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల లా ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. (2013 సంవత్సరానికి లాసెట్ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 26. పరీక్ష తేదీ: జూన్ 6).
వెబ్‌సైట్:www.aplawcet.org

క్లాట్: నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) నిర్వహిస్తారు. ఈ ర్యాంక్‌తో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి లా కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (రిజర్‌‌వడ్ కేటగిరీ విద్యార్థులకు 50 శాతం మార్కులు). చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా కోర్సు ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం జూలై ఒకటో తేదీనాటికి 20 ఏళ్లు (రిజర్‌‌వడ్ కేటగిరీ విద్యార్థులు 22 ఏళ్లు వయసు) మించకూడదు.

నోటిఫికేషన్: ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో వెలువడుతుంది.
పరీక్షా విధానం: ఐదు విభాగాల్లో క్లాట్ నిర్వహిస్తారు . అవి..
ఇంగ్లిష్ (కాంప్రెహెన్షన్‌తో కలిపి- 40 మార్కులు)
జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్ (50మార్కులు)
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (20 మార్కులు)
లీగల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు)
లాజికల్ రీజనింగ్ (40 మార్కులు). వీటికి 2 గంటల్లో సమాధానాలను గుర్తించాలి.

క్లాట్ ద్వారా ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు:
* నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ - బెంగళూరు.
* నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా - హైదరాబాద్.
* దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా) - వైజాగ్.
* ద నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ - భోపాల్.
* ద వెస్ట్‌బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సెన్సైస్ - కోల్‌కతా
* నేషనల్ లా యూనివర్సిటీ - జోథ్‌పూర్.
* హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ - రాయ్‌పూర్.
* గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ
- గాంధీనగర్.
* డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ - లక్నో.
* ఆర్‌ఎన్‌ఎల్‌యు ఆఫ్ లా- పాటియాలా.
* చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ- పాట్నా.
* నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్‌‌డ్స లీగల్ స్టడీస్ - కొచి.
* నేషనల్ లా యూనివర్సిటీ - ఒడిశా.
* నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్‌‌చ ఇన్ లా - రాంచీ.
* నేషనల్ యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్
అకాడెమీ - అసోం.
వెబ్‌సైట్: www.clat.ac.in

ఏఐఎల్‌ఈటీ: నేషనల్ లా యూనివర్సిటీ- న్యూఢిల్లీ, ఏఐఎల్‌ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్)ను నిర్వహిస్తుంది. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు-బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/ తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షా విధానం: మొత్తం ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలకు ఏఐఎల్‌ఈటీ ఉంటుంది. అవి.. ఇంగ్లిష్ (35 ప్రశ్నలు); జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ (35 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (10 ప్రశ్నలు); లీగల్ ఆప్టిడ్యూడ్ (35 ప్రశ్నలు); లాజికల్ రీజనింగ్ (35 ప్రశ్నలు); వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి.
వెబ్‌సైట్: http://nludelhi.ac.in/
(ఏఐఎల్‌ఈటీ నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 5, 2013).

ఎస్‌ఈటీ: సింబయాసిస్ లా స్కూల్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష ఎస్‌ఈటీ (సింబయాసిస్ ఎంట్రెన్స్ టెస్ట్).
అర్హత: 50 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీలకు 45 శాతం) ఇంటర్మీడియెట్/తత్సమానం.
పరీక్షా విధానం: మొత్తం 150 మార్కులకు ఐదు విభాగాల్లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎస్‌ఈటీ ఉంటుంది. అవి.. లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, రీడింగ్ కాంప్రెహెన్షన్. ఇందులో ప్రతి విభాగం నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 120 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. దీని తర్వాత నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.set&test.org
(2013 సంవత్సరానికి ఎస్‌ఈటీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 14)

ఎల్‌శాట్: లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా (ఎల్‌శాట్)ను అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఏసీ) నిర్వహిస్తుంది. లాశాట్ స్కోర్ ఆధారంగా దేశంలోని దాదాపు 40పైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు. వీటిలో జిందాల్ గ్లోబల్ లా స్కూల్, అమిటీ లా స్కూల్, జోథ్‌పూర్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ వంటి ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.

పరీక్షా విధానం: మొత్తం నాలుగు విభాగాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో లాశాట్ ఉంటుంది. అవి.. అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్-1, లాజికల్ రీజనింగ్-2, రీడింగ్ కాంప్రెహెన్షన్. ప్రతి విభాగానికి 35 నిమిషాల చొప్పున 140 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి.

అర్హత ప్రమాణాలు ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి మారుతు ఉంటాయి. కాబట్టి దరఖాస్తుకు ముందు ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల అర్హత ప్రమాణాలు తెలుసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.pearsonvueindia.com


అవకాశాలు: ప్రపంచీకరణ, అవుట్ సోర్సింగ్ నేపథ్యంలో.. లా గ్రాడ్యుయేట్లకు వైట్ కాలర్ జాబ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, బ్యాంకులు, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో లీగల్ అడ్వైజర్, డ్రాఫ్ట్ రైటర్‌గా అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల కాలంలో పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థలు, కాపీరైట్ సంస్థలు, పబ్లిషింగ్ సంస్థలు, ఎన్‌జీఓలు కూడా లా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. తమ కార్యకలాపాల చట్టపరమైన అంశాల పర్యవేక్షణకు వీరిని నియమించుకుంటున్నాయి. లా గ్రాడ్యుయేట్లు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడం ద్వారా అధ్యాపక వృత్తిలో చేరొచ్చు.

ప్రభుత్వ రంగంలో: లా గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ రంగలోనూ అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. ఇవి అధికశాతం న్యాయవాద వృత్తికి సంబంధించినవై ఉంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌స, ఏపీపీఓ, మెజిస్ట్రేట్స్, సబ్-మెజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇలా ప్రభుత్వ సర్వీసులో అడుగుపెట్టిన వారు.. హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థాయికి చేరుకోవచ్చు.

ఎల్‌పీఓ: ‘లా’ గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా సరికొత్త వేదిక లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (ఎల్‌పీఓ). ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన న్యాయ సేవా సంస్థలు భారీ సంఖ్యలో (దాదాపు 150 నుంచి 200 వరకు) మన దేశంలో శాఖలను ఏర్పాటు చేస్తూ.. న్యాయ నిపుణుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆయా దేశాల చట్టాలపై శిక్షణనిచ్చి పర్మినెంట్ హోదా కల్పిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు కనీసం రూ. 25 వేల వేతనం ఆఫర్ చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్లో అసోసియేట్‌గా అడుగుపెట్టి అనుభవం ఆధారంగా రెండు, మూడేళ్ల వ్యవధిలో సీనియర్ అసోసియేట్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. రానున్న ఐదేళ్లలో ఎల్‌పీఓ రంగంలో 30 నుంచి 40 వేల మంది అవసరం ఏర్పడుతుందని.. లా గ్రాడ్యుయేట్లకు ఎల్‌పీఓ ఓ బంగారు వేదికవుతుందని ఓ అంచనా.

విదేశాల్లోనూ అవకాశాలు: లా గ్రాడ్యుయేట్లకు విదేశీ అవకాశాలూ లభిస్తున్నాయి. మన చట్టాలతో సరిపోలే బ్రిటన్‌లో అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ లా యూనివర్సిటీలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో విదేశీ సంస్థలు వస్తుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాకుండా ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో ఎంపికైన వారిలో కనీసం 20 నుంచి 25 శాతం మంది విదేశీ సంస్థల్లో అడుగుపెడుతున్నారు.

వేతనాలు: ప్రభుత్వ రంగంలో స్థిరపడిన వారికి హోదాను బట్టి రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు, బహూళ జాతి, తదితర సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఏడాదికి రూ. 4 నుంచి 6 లక్షల వరకు పే ప్యాకేజ్‌లు అందుతున్నాయి. సొంతంగా న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు.

ఉన్నత విద్య: లా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్ ఆఫ్ లా) కోర్సు చేయవచ్చు. దీని తర్వాత పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో ఉండే స్పెషలేజేషన్లు-సివిల్/క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, లేబర్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, రియల్ ఎస్టేట్ లా, హ్యూమన్ రైట్స్ లా, కార్పొరేట్ లా, బిజినెస్ లా, తదితరాలు. క్లాట్, పీజీలాసెట్ (మన రాష్ట్ర స్థాయి పరీక్ష) వంటి పరీక్షల ద్వారా పీజీ కోర్సుల్లో అడుగు పెట్టొచ్చు.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్: న్యాయవాద వృత్తి చేపట్టాలకునే అభ్యర్థులు.. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పొందాక ప్రాక్టీస్‌కు ఉపక్రమించాలంటే తప్పనిసరిగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు ఉన్న పరిజ్ఞానాన్ని, సబ్జెక్ట్ నాలెడ్‌‌జను పరీక్షించి.. సదరు అభ్యర్థి వృత్తికి సరిపోతాడా? లేదా? నిర్ణయించడమే ఈ పరీక్ష ఉద్దేశం. ఈ ఎగ్జామినేషన్ ప్రతి ఏటా రెండు సార్లు (జూన్/జూలై, నవంబర్/డిసెంబర్) జరుగుతుంది. మూడున్నర గంటల వ్యవధిలో రెండు కేటగిరీ (కేటగిరీ-1, కేటగిరీ-2)ల్లో పార్‌‌ట-1, పార్‌‌ట-2 పద్ధతిలో జరుగుతుంది.
వెబ్‌సైట్: www.barcouncilofindia.org

బహుముఖ అవకాశాల ‘లా’
ఇంటర్మీడియెట్ అర్హతతో అయిదేళ్ల లా కోర్సులో ప్రవేశించొచ్చు. దీనికోసం ప్రతి ఏటా నిర్వహించే లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో అయిదేళ్ల లా కోర్సును దాదాపు 30 కళాశాలలు అందిస్తున్నాయి. వీటిలో సుమారు 2700 అందుబాటులో ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ‘లా’ ప్రస్తుతం కెరీర్ పరంగా పలు అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ పరంగా.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తవగానే ఎలాంటి అనుభవం లేకున్నా నేరుగా జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. అదే విధంగా డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులకు నేరుగా రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరు కావచ్చు. హైకోర్టు, లేదా సుప్రీంకోర్టులలో పదేళ్ల ప్రాక్టీస్ అనుభవం ఉంటే ఆయా కోర్టుల్లో జడ్జి పోస్టులకు అర్హత లభిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యం గా ప్రతి మండలంలో ఒక మండల జ్యుడిషియల్ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సమీప భవిష్యత్తులో లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పుష్కలం. ఇక.. ప్రైవేట్ రంగంలో అవకాశాలకు కొదవే లేదు. కారణం విస్తరిస్తున్న పారిశ్రామికీకరణే. ఆయా సంస్థలు లా గ్రాడ్యుయేట్లను లీగల్ అడ్వైజర్లుగా నియమిస్తున్నాయి. క్లాట్ ద్వారా ప్రవేశం లభించే 14 నేషనల్ లా యూనివర్సిటీల్లో పూర్తి చేస్తే లక్షల్లో జీతంతో క్యాంపస్ సెలక్షన్స్ అందుకోవచ్చు. ఉన్నత విద్య కోణంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేయొచ్చు. బోధనపై ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీ చేయడం అభిలషణీయం.

No comments:

Post a Comment