ఫారెన్ లాంగ్వేజెస్
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. వివిధ దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీలు మరో దేశంలో పాగా వేస్తున్నాయి. అంతేకాకుండా సంబంధిత దేశాల్లో కంపెనీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం, పరస్పరం సంప్రదింపులు వంటి కార్యకలాపాలు చేస్తున్నాయి. దీంతో సంబంధిత విదేశీ భాష తెలిసి ఉండటం తప్పనిసరి అవుతోంది. ఈ కారణంగా విదేశీభాషలు నేర్చుకున్న వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా నాన్ ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటం వంటి కారణాల వల్ల విదేశీ భాషలు నేర్చుకోవాలనుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ప్రవేశం.. కోర్సులు:
దేశంలో విదేశీ భాషలు అందిస్తోన్న యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెషనల్ కోర్సుల మాదిరిగానే ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని యూనివర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంటే మరికొన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులనందించడంలో హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (ఢిల్లీ) లకు మంచి పేరుంది. హైదరాబాద్‌లో ఉన్న రామకృష్ణ మఠం వంటి కొన్ని సంస్థలు కూడా విదేశీ భాషలను అందిస్తున్నాయి.
డిమాండ్ ఉన్న భాషలు:
గ్లోబలైజేషన్‌తో పారిశ్రామిక రంగంతోపాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా ఫారెన్ లాంగ్వేజెస్‌లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్, స్పానిష్, జపనీస్ భాషలకు విపరీతమైన డిమాండ్, ఆదరణ ఉంటోంది.
బోధించే అంశాలు:
సాధారణంగా డిగ్రీ స్థాయిలో.. తొలి ఏడాదంతా ఇంగ్లిష్‌లోనే బోధన ఉంటుంది. తర్వాతి రెండేళ్లు సంబంధిత భాషా సాహిత్యం, ఫొనెటిక్స్, క్లాసికాలజీ, ట్రాన్స్‌లేషన్, దేశ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తారు. సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా తదితర కోర్సుల సిలబస్‌లో నిర్ణీత లాంగ్వేజ్, ఇంగ్లిష్‌లపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆయా దేశాల పరిస్థితులపై అవగాహన కలిగేలా మరికొన్ని సబ్జెక్టులను బోధిస్తారు.
కెరీర్:
ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు విస్తృతం. వీరికి సెక్రటేరియల్ స్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ వరకు వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు ఉం టాయి. ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. వివిధ ఐటీ కంపెనీలు, మీడియా, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాలయాల్లో అవకాశాలు ఉంటాయి.
ట్రాన్స్‌లేటర్స్.. ఇంటర్‌ప్రిటేటర్స్:
విదేశీ భాష నిపుణుల్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్‌లేషన్(అనువాదం). భాషపై మంచి పట్టు, అర్థాన్ని మార్చకుండా చక్కగా అనువదించే నేర్పు ఉంటే ఎదగడానికి అవకాశాలెన్నో. మల్టీ నేషనల్ కంపెనీలు దేశంలో అడుగుపెట్టడంతో.. మన కంపెనీలు ఫారెన్ కంపెనీలతో జాయింట్ వెంచర్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ ప్రక్రియలో విదేశీ ప్రతినిధులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ వ్యవహారాల కోసం సంబంధిత విదేశీ భాషపై పట్టు ఉన్న వారు అవసరమవుతున్నారు. టెక్నికల్, సైంటిఫిక్, బిజినెస్, సాహిత్యం రంగాల్లో కూడా వీరు తప్పనిసరి కావడంతో సంబంధిత ఆర్గనైజేషన్స్ ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ట్రాన్స్‌లేటర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. భారత్‌లో ఐటీ రంగ వృద్ధి జోరుగా ఉంది. ప్రపంచదేశాల నుంచి అనేక ప్రాజెక్టులు ఐటీ కంపెనీలకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నివేదికల తర్జుమాకు పెద్ద ఎత్తున ట్రాన్స్‌లేటర్లు అవసరం ఉంది. ఒక వ్యక్తి మాటలను అనువాదం చేసి మరొక వ్యక్తికి అప్పటికప్పుడు వినిపించే ప్రక్రియే ఇంటర్‌ప్రిటేషన్. వీరి అవసరం సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, సభలలో ఉంటుంది.
టీచింగ్:
ఫారెన్ లాంగ్వేజెస్ అభ్యర్థులకు ఉపాధి వేదికగా నిలుస్తోన్న మరో రంగం టీచింగ్. ఈ వృత్తిలో ప్రవేశించిన వారికి బోధనతోపాటు సంబంధిత భాషలో మరింత నిష్ణాతులుగా తయారయ్యే అవకాశం దీని వల్ల లభిస్తుంది. ప్రస్తుతం దేశంలోని పలు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు విదేశీ భాష కోర్సులను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా అవకాశాలు అనేకం.
ఆఫర్ చేస్తున్న సంస్థలు:
* ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-
హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్ క్యాంపస్‌లు.
కోర్సులు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ రష్యన్
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (అరబిక్/ఫ్రెంచ్/స్పానిష్/జర్మన్/రష్యన్) పీజీ డిప్లొమా ఇన్ అరబిక్
వెబ్‌సైట్: www.efluniversity.ac.in
* ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
* జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ.
వెబ్‌సైట్: www.jnu.ac.in
* రామకృష్ణ మఠం-హైదరాబాద్
వెబ్‌సైట్: www.rkmath.org
గ్లోబలైజేషన్ నేపథ్యంలో..
ఇఫ్లూలో ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, జపనీస్, అరబిక్ లాంగ్వేజ్‌లలో బీఏ ఆనర్స్ కోర్సులు, పార్ట్‌టైం విధానంలో కొరియన్, చైనీస్, పర్షియన్ లాంగ్వేజ్‌లలో డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత గ్లోబలైజేషన్ నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల్లోనూ జాయింట్ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్పానిష్, ఫ్రెంచ్, సౌత్ కొరియన్, ఇటాలియన్ లాంగ్వేజ్‌లకు కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అకడెమిక్ డిగ్రీ ఉన్న అభ్యర్థులైనా ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్‌ను నేర్చుకుంటే అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు అమెరికాలో స్థిరపడాలనుకునే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తాను చేరే సంస్థకు అవసరమైన లాంగ్వేజ్‌ను నేర్చుకుని అడుగుపెడితే త్వరగా రాణించగలడు. ఇక.. పూర్తి స్థాయిలో ఫారెన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్ హోల్డర్లకు ప్రధానమైన ఉపాధి వేదికలు ట్రావెల్ అండ్ టూరిజం, టీచింగ్, ట్రాన్స్‌లేషన్. దేశంలో దాదాపు 40 యూనివర్సిటీలు ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో అధ్యాపకులకు కనీసం రూ. 40 వేల జీతం లభిస్తోంది. టూరిజం విభాగంలో గైడ్లుగా పనిచేస్తూ రోజుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు సంపాదించేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ట్రాన్స్‌లేషన్ ఒక పరిశ్రమగా రూపొందుతోంది. దీని ద్వారా లభించే ఆదాయానికి ఆకాశమే హద్దు.
జర్నలిజం
భారతదేశంలో మీడియాలోకి విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతిస్తుండడంతో ఈ రంగంలోకి అనేక సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీంతో మీడియా రంగంలో అవకాశాలు కోకొల్లలు అని చెప్పొచ్చు. మీడియా మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక్క ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు... ఇంకా సినిమాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, రేడియోలు, పరిశ్రమలు, సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ విభాగం, ఎడిటింగ్, స్క్రిప్ట్‌రైటింగ్, మ్యాగజైన్స్, వెబ్ జర్నలిజం.. ఇలా అన్నీ వస్తాయి. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన సాధనాలు పత్రికలు, టీవీలు. అందుకే గత ఐదేళ్లలో భారతదేశంలో టీవీ, పత్రికా రంగాలు గణనీయంగా వృద్ధి చెందాయి. దేశంలో జర్నలిజంలో శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పేరుతో రెండేళ్ల కోర్సు నిర్వహిస్తున్నాయి.
మీడియాలో పోటీ నెలకొనడంతో నిష్ణాతులైన అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా అనేక పత్రికలు, ఛానళ్లు సొంతంగా జర్నలిజంలో శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు నేరుగా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రధాన దినపత్రికలన్నింటికి సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో నియామకాలకు ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు విడుదల చేసి అభ్యర్థులను భర్తీ చేసుకుంటాయి. అదేవిధంగా జాతీయస్థాయి దినపత్రికలైన ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలకు సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి.
మన రాష్ట్రంలో మీడియా కోర్సులు:
* ఆంధ్రా యూనివర్సిటీ - విశాఖపట్నం
కోర్సు: ఎంజేఎంసీ
అర్హత:
బీఏ/బీకాం/బీఎస్సీ/బీబీఎం/బీసీఏ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: http://andhrauniversity.info
* ఆచార్య నాగార్జున యూనివర్సిటీ - గుంటూరు
కోర్సు:
ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
* కృష్ణా యూనివర్సిటీ - మచిలీపట్నం
కోర్సు:
ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.krishnauniversity.ac.in
* } వేంకటేశ్వర యూనివర్సిటీ- తిరుపతి
కోర్సు: ఎంసీజే (కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం)
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: http://svuniversity.in
* ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు: బీసీజే (వ్యవధి: ఏడాది)
అర్హత: 40శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకాం
కోర్సు: ఎంసీజే (వ్యవధి: ఏడాది)
అర్హత: 40 శాతం మార్కులతో బీసీజే ఉత్తీర్ణత.
కోర్సు: ఎంసీజే (వ్యవధి: రెండేళ్లు)
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.osmania.ac.in
* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
కోర్సు: ఎంఏ కమ్యూనికేషన్ (కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్, ప్రింట్ జర్నలిజం అండ్ న్యూ మీడియా, టెలివిజన్ అండ్ రేడియో)
అర్హత:
55 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
వెబ్‌సైట్: www.uohyd.ac.in
* ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం - చెన్నై
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్
స్పెషలైజేషన్స్:
{పింట్, న్యూ మీడియా, టీవీ అండ్ రేడియో
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.asianmedia.org/index.asp
* టైమ్స్ స్కూల్ ఆఫ్ జర్నలిజం - న్యూఢిల్లీ
కోర్సు:పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం.
అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.tcms.in
* ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా స్టడీస్
-న్యూఢిల్లీ
కోర్సు: ప్రోగ్రామ్ ఇన్ జర్నలిజం
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.exims.in
మీడియా... కెరీర్ స్కోప్:
మీడియా సంస్థల్లో జర్నలిస్టులు ముఖ్యంగా రిపోర్టర్, సబ్‌ఎడిటర్, ఆపై హోదాల్లో పనిచేస్తారు. అయితే జర్నలిస్టులు కావాలనుకునేవారిని రాష్ర్టంలో పలు పత్రికలు, టీవీ ఛానళ్లు సొంత జర్నలిజం స్కూలు ద్వారా ఎంపిక చేసుకుని వారికి ఏడాది శిక్షణతో జర్నలిస్టులుగా తయారుచేస్తున్నాయి. శిక్షణ దశలో వీరికి వేతనాలు రూ.5 వేల నుంచి రూ.2 వేలలోపు ఉంటాయి. శిక్షణ తర్వాత తమ సంస్థల్లో వీరిని ప్రొబేషనరీ జర్నలిస్టులుగా నియమిస్తాయి. ఆ తర్వాత పనితీరు ఆధారంగా సంస్థ ఉద్యోగిగా నియామకం ఖరారుచేస్తాయి. వీరికి మొదట రూ.10 వేల నుంచి సీనియారిటీ ఆధారంగా రూ.60 వేలకు వరకు లభిస్తాయి.
* రిపోర్టర్: వీరంతా క్షేత్రస్థాయిలో తిరుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయపార్టీలు, వివిధ స్వచ్ఛంధ సంస్థల చుట్టూ తిరుగుతూ వార్తలు సేకరిస్తారు. ప్రతిరోజూ సమాజంలో జరిగే అన్ని కీలక పరిణామాలను గమనిస్తూ వార్తలు, వ్యాఖ్యానాలు, కథనాలు, విశ్లేషణలు చేస్తారు. వీరు రాసే కథనాలు, వార్తలు మరుసటి రోజు టీవీలు, పత్రికల్లో వస్తాయి.
* సబ్‌ఎడిటర్, కాపీ ఎడిటర్: పత్రికల్లో పనిచేసే వారిని సబ్‌ఎడిటర్లని, టీవీల్లో పనిచేసే వాళ్లను కాపీఎడిటర్ అని పిలుస్తారు. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సబ్ ఎడిటర్లు పరిశీలించి సమగ్రంగా తీర్చిదిద్దుతారు. టీవీల్లో పనిచేసే కాపీఎడిటర్లు విలేకరి తీసుకువచ్చిన వార్తల చిత్రాలను క్లుప్తీకరించి వీక్షకులకు తక్షణం అర్థమయ్యేలా రూపొందిస్తారు.
* న్యూస్ రీడర్: నిత్యం టీవీల్లో వార్తలను చదివేవారిని న్యూస్‌రీడర్లు అంటారు. కనీస అర్హత డిగ్రీ ఉంటేనే ఆయా ఛానళ్లు తీసుకుంటాయి. మంచి మాటతీరు, ఆకర్షణీయరూపం ఉన్నవాళ్లకు ఆయా సంస్థలు శిక్షణ ఇచ్చి న్యూస్‌రీడర్ ఉద్యోగాలు కేటాయిస్తాయి.
డిగ్రీలోనూ గ్రూప్ సబ్జెక్ట్‌గా జర్నలిజం
జర్నలిజం అంటే సాధారణ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ప్రవేశం కల్పించే బీసీజేనే గుర్తుకొస్తుంది. కానీ ఇటీవల కాలంలో జర్నలిజంకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో ఒక సబ్జెక్ట్‌గా జర్నలిజంను కొన్ని కళాశాలలు అందిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కోఠి మహిళా డిగ్రీ కళాశాలలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ప్రైవేట్ రంగంలో మరికొన్ని కళాశాలలు కూడా జర్నలిజం గ్రూప్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సును మరిన్ని కళాశాలల్లో రూపొందించాలనే ప్రణాళికలు ఉన్నప్పటికీ అధ్యాపకుల కొరత కారణంగా ఆచరణ సాధ్యం కావట్లేదు. ఇక.. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు అర్హులు. అదే విధంగా ప్రైవేట్ రంగంలో పలు సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా, ఎగ్జిక్యూటివ్స్‌గా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో రూ. 15 వేల జీతం అందుకునే వీలుంది. ఉన్నత విద్యా పరంగా యూజీసీ-నెట్ జేఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తే.. ఈ రంగంలో పరిశోధన చేసేందుకుగాను అయిదేళ్లపాటు నెలకు రూ. 22 వేల స్టైఫండ్ కూడా లభిస్తుంది. ఇలా.. ఇప్పుడిప్పుడే వేగంగా జర్నలిజం వృద్ధి చెందుతోంది.
No comments:
Post a Comment