Thursday, January 2, 2014

 సుగర్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -శ్రవణ్, విశాఖపట్నం.
 పలు రకాల బయోకెమికల్ విధానాల కలయికతో సుగర్ టెక్నాలజీ రూపొందుతుంది. పీజీ స్థాయిలో సుగర్ టెక్నాలజీ కోర్సులో సుగర్ కెమిస్ట్రీ, బాయిలింగ్, ఫెర్మిటేషన్, సుగర్ ప్రొడక్షన్‌కు సంబంధించిన టెక్నిక్‌లు ఉంటాయి. అంతేకాకుండా సుగర్ బాయిలింగ్, ఇండస్ట్రియల్ ఫెర్మిటేషన్, ఆల్కహాల్ టెక్నాలజీ, సుగర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, తదితర అంశాల్లో స్వల్పకాలిక కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

 అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 నేషనల్ సుగర్ ఇన్‌స్టిట్యూట్-కాన్పూర్.
 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సుగర్ టెక్నాలజీ
 అర్హత: బీఈ/బీటెక్ (కెమికల్ ఇంజనీరింగ్) లేదా బీఎస్సీ (ఎంపీసీ)
 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సుగర్ ఇంజనీరింగ్
 అర్హత: బీఈ/ బీటెక్ (మెకానికల్/ ప్రొడక్షన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)/ తత్సమానం.
 కోర్సు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సుగర్ ఇంజనీరింగ్
 అర్హత: డిప్లొమా (మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)
 వివరాలకు: http://nsi.gov.in

 మన రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా స్థాయిలో కెమికల్ ఇంజనీరింగ్ (సుగర్ టెక్నాలజీ) కోర్సు అందుబాటులో ఉంది. పాలిసెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. అర్హత: 10వ తరగతి. ఈ కోర్సు తర్వాత కెమికల్/పెట్రో కెమికల్/పెట్రోలియం బ్రాంచ్‌లతో బీటెక్ చేయొచ్చు.


 బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సు వివరాలను తెలపండి?
 -సరళ, కరీంనగర్.
 మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల కలయికతో రూపొందిన కోర్సు బయోఇన్ఫర్మాటిక్స్. వివరంగా చెప్పాలంటే.. స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అనువర్తనాలను మాలిక్యులర్ బయాలజీ విభాగంలోని పరిశోధనలు, ఆవిష్కరణల్లో ఉపయోగించే శాస్త్రం బయోఇన్ఫర్మాటిక్స్. ఇందులో సంబంధిత డేటా సేకరణ, నిర్వహణ, అధ్యయనం, విశ్లేషణ, తదితర అవసరాల కోసం కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ విధంగా సేకరించిన బయాలజికల్ డేటాను మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉద్దేశించిన పరిశోధన కోసం వినియోగిస్తారు. బయోఇన్ఫర్మాటిక్స్‌కు సంబంధించి మన రాష్ట్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ స్థాయిలో మాత్రం బీఎస్సీ/బీటెక్ కోర్సుల్లోని బయోటెక్నాలజీ సబ్జెక్ట్‌లో ఒక భాగంగా బయోఇన్ఫర్మాటిక్స్‌ను అధ్యయనం చేయవచ్చు.
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఐఐఐటీ-హైదరాబాద్; వివరాలకు: www.iiit.ac.in
 సెంట్రల్ యూనివర్సిటీ-హైదరాబాద్
 వివరాలకు: www.uohyd.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
 వివరాలకు: www.andhrauniversity.edu.in
 ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఫర్ ఉమెన్-హైదరాబాద్
 వివరాలకు: www.oucwkoti.ac.in


 అడ్వర్‌టైజ్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులను వివరించండి?
 -రాజ వర్ధన్, నల్గొండ.
 ప్రజలలో తమ ఉత్పత్తుల ప్రచారానికి చక్కటి మార్గం అడ్వర్‌టైజ్‌మెంట్. సృజనాత్మకత, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ప్రజల అభిరుచి - ఆసక్తి సంబంధిత అంశాలపై అవగాహన, ప్రత్యేక టెక్నికల్ స్కిల్స్, చక్కని భావ వ్యక్తీకరణ ఉన్నవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు.

 అడ్వర్‌టైజ్‌మెంట్ రంగంలోని వివిధ విభాగాల్లో పుష్కలమైన ఉపాధి అవకాశాలున్నాయి. సంబంధిత అంశంలో షార్ట్ట్‌టర్మ్ కోర్సులు లేదా డిప్లొమా/ మల్టిమీడియా కోర్సులు చేయడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించొచ్చు. బ్యాచిలర్ స్థాయిలో జర్నలిజం, ఆర్ట్స్, మాస్ మీడియా సంబంధిత అంశాల్లో డిగ్రీ చేసిన వారు కూడా ఈ రంగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. అటు తర్వాత ప్రస్తుత ట్రెండ్‌కనుగుణంగా స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకుంటూ వెళితే స్వల్ప కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది.

 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ కమ్యూనికేషన్స్, బెంగళూరు- బీఎస్సీ(విజువల్ కమ్యూనికేషన్స్), డిప్లొమా ఇన్ డిజైన్ (అడ్వర్‌టైజింగ్ స్పెషలైజేషన్‌గా) కోర్సులను అందిస్తుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులు. మాస్టర్ స్థాయిలో ఎంఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది.
 వెబ్‌సైట్: www.nicindia.org

 సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్-పుణే, ఎంబీఏ (మీడియా కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్, పీఆర్-బ్రాండ్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌గా) కోర్సును ఆఫర్ చేస్తుం ది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.simc.edu

 మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్, భోపాల్- ఎంఏ (అడ్వర్‌టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
 వెబ్‌సైట్: www.mcu.ac.in

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్- ముంబై, పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్‌టైజింగ్, మీడియా అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
 వెబ్‌సైట్: www.niemindia.com
మెరైన్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి?
 -రఘునందన్, పాలకొల్లు.
 మెరైన్ ఇంజనీర్లు ప్రధానంగా ఓడలు, పెద్ద పెద్ద పడవల రూపకల్పనలో పాల్పంచుకుంటారు. వాటి ఇంజిన్, వివిధ భాగాల పనితీరును గమనించడం కూడా వీరి బాధ్యతే. ఓడ సమర్థంగా నడవడానికి కావల్సిన అన్ని రకాల వ్యవహారాలను మెరైన్ ఇంజనీర్లు పర్యవే క్షిస్తారు. మోడ్రన్ మెరైన్ టెక్నాలజీ, బేసిక్ టూల్స్, వర్క్‌షాప్ టెక్నాలజీ, పవర్ హౌసెస్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తదితర అంశాలను మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా బోధిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత పోర్ట్స్, షిప్పింగ్ పరిశ్రమలు, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వంటి సంస్థల్లో ఉపాధి పొందొచ్చు. అమెరికా, యూకేలలో కూడా వీరికి విరివిగా అవకాశాలుంటాయి.

 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం.
 ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 మెరైన్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్-కోల్‌కతా.
 వెబ్‌సైట్: www.merical.ac.in
 టోలనీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్-పుణే
 వెబ్‌సైట్: www.tolani.edu
 వీఈఎల్‌ఎస్ యూనివర్సిటీ-చెన్నై
 వెబ్‌సైట్: www.velsuniv.org


 పీజీలో సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
     -అశోక్, ప్రొద్దుటూరు
 ఇంటర్నెట్, కంప్యూటర్ల వినియోగంలో అనుసంధానం చేసిన నెట్‌వర్క్‌కు సంబంధించిన లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడమే ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించి నెట్‌వర్క్, అప్లికేషన్స్, వెబ్‌సైట్స్ తదితరాల నెట్‌వర్క్‌కు చెందిన సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను సురక్షితంగా ఉంచేందుకు కావల్సిన వ్యూహాలను ఎథికల్ హ్యాకర్స్ రూపొందిస్తారు. కోర్సులో భాగంగా నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, ఆర్కిటెక్చర్, నెట్‌వర్కింగ్‌టూల్స్, టెక్నిక్స్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అంశాలను బోధిస్తారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సును పలు యూనివర్సిటీలు పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు..
 ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్
 కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.iiit.ac.in
 జేఎన్‌టీయూ-హైదరాబాద్
 కోర్సు: ఎంటెక్ (కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.jntuh.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
 కోర్సు: ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్) వివరాలకు: www.andhrauniversity.edu.in
 ఈ యూనివర్సిటీలు గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తాయి.


 ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా?
     -ధరణి, సికింద్రాబాద్.
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తుంది. పీహెచ్‌డీ కోర్సుల్లో సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/ యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్‌ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్‌ఎఫ్; జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్‌లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
 వివరాలకు: www.iisc.ernet.in


 యూపీఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్ పరీక్ష వివరాలను తెలపండి? జియాలజీలో కోర్సులను ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
     -షాలినీ, కుప్పం.
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జియాలజిస్ట్‌ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. దీని ద్వారా జియాలజిస్ట్, హైడ్రో జియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హత: జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ (జియలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజనీరింగ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ ఎర్త్ సైన్స్ అండ్ రీసోర్సెస్ మేనేజ్‌మెంట్/ ఓషియనోగ్రఫీ అండ్ కోస్టల్ ఏరియాస్ స్టడీ/ పెట్రోలియం జియో సెన్సైస్/ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్/ జియో కెమిస్ట్రీ/ జియలాజికల్ టెక్నాలజీ/ జియో ఫిజికల్ టెక్నాలజీ) హైడ్రో జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ (జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ) లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ైహైడ్రో జియాలజీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి.

 అవి.. జనరల్ ఇంగ్లిష్ (100 మార్కులు), జియాలజీ పేపర్-1 (200 మార్కులు), జియాలజీ పేపర్-2 (200 మార్కులు), జియాలజీ పేపర్-3(200 మార్కులు), హైడ్రోజియాలజీ (200 మార్కులు). ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది.

 వివరాలకు: www.upsc.gov.in
 మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు యూజీ, పీజీ స్థాయిల్లో జియాలజీ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), పీహెచ్‌డీ (జియాలజీ) కోర్సును ఆఫర్ చేస్తుంది.

సుస్థిర భవితకు.. సమర్థ ప్రణాళిక

‘కెరీర్ ప్లానింగ్, ప్లాన్ యువర్ కెరీర్, కెరీర్ ప్లానింగ్ స్ట్రాటజీస్’.. నేటి పోటీ ప్రపంచంలో కార్పొరేట్ కంపెనీల్లో రాణించేందుకు అవసరమైన సాధనాలు. ప్రతి రంగంలో తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. సుస్థిర కెరీర్‌ను నిర్మించుకునేందుకు సాధ్యమైనంత ముందుగానే కెరీర్‌ను ప్లాన్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. కెరీర్ ప్లానింగ్ అంటే.. విద్యార్థి తన ఆసక్తులు, నైపుణ్యాలు, వ్యక్తిత్వం, విలువలు ఏంటో తెలుసుకుంటూ... తనకంటూ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. ఆ లక్ష్య సాధన కోసం.. నిరంతరం కృషి చేయడమే! సరైన కెరీర్ ప్లానింగ్ లేక ఎంతోమంది మంచి అవకాశాలను దూరం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. కెరీర్ ప్లానింగ్‌కు సంబంధించి నిపుణుల సలహాలు, సూచనలు!!

 కెరీర్ ప్లానింగ్ బాగుంటేనే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఇది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. మరి ఈ కెరీర్ ప్లానింగ్‌కు సరైన సమయం ఏది? నిపుణుల అభిప్రాయం ప్రకారం- మంచి భవిష్యత్తును ఆశించే విద్యార్థి కెరీర్ ప్లానింగ్‌కు సరైన సమయం.. పాఠశాల విద్యను పూర్తి చేసుకునే దశ. పాఠశాల స్థాయి దాటాక కాలేజీ దశ. ఈ కాలేజీ దశ ప్రారంభంలోనే కెరీర్ ప్లానింగ్ దిశగా అడుగులు వేయాలి. ఈ క్రమంలో.. విద్యార్థి తనను తాను ప్రశ్నించుకోవాలి. నా అభిరుచులు, ఆసక్తులు ఏంటి? నాకున్న నైపుణ్యాలు ఏమిటి? భవిష్యత్‌లో నేను ఏం కావాలనుకుంటున్నాను? నా ముందున్న అవకాశాలు (ఆప్షన్స్) ఏంటి? లక్ష్య సాధనకు నేను ఏం చేయాలి..? ఇవి కెరీర్ ప్లానింగ్‌లో ప్రాథమికంగా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అంశాలు. ఆ తర్వాత తమ లక్ష్యానికి అనుగుణంగా కోర్సును ఎంచుకోవాలి.

 కోర్సును ఎంచుకున్నాక..:
 తన కెరీర్ లక్ష్యానికి అనుగుణంగా కోర్సును ఎంచుకున్నాక.. సదరు కోర్సులో చక్కటి నైపుణ్యాలను అందించే కాలేజీలను అన్వేషించాలి. కేవలం అకడమిక్‌పరమైన అభిరుచులే కాకుండా.. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కూడా కెరీర్ ప్లానింగ్ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. కార్పొరేట్ కాలేజీ వాతావరణంలో.. గంటల తరబడి తరగతి గదిలో మగ్గిపోయే విద్యార్థులు.. తమలోని ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్(స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌లో ఆసక్తి తదితరాలు)ని ప్రదర్శించే అవకాశం లేకపోవచ్చు.

 ఇది కొంతమందిలో భవిష్యత్తుపై ప్రతికూల దృక్పథాన్ని కలిగించే ఆస్కారముంది. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. భవిష్యత్తు అంటే.. కేవలం ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులే అనే అభిప్రాయాన్ని వారు దూరం చేసుకోవాలి. తమ పిల్లల ఆసక్తి, అభిరుచులను తెలుసుకుని అందుకు తగిన కోర్సులు, భవిష్యత్తు అవకాశాలను, ప్రత్యామ్నాయాలను గుర్తించి తోడ్పాటునందించాలి. సరైన మార్గ నిర్దేశనం చేయాలి.


 ఉన్నత విద్యావకాశాలపై అవగాహన:
 మన విద్యా విధానంలో పాఠశాల తర్వాత దశ ఇంటర్మీడియెట్, లేదా సీబీఎస్‌ఈ +2. వీటిలో అందుబాటులో ఉండే గ్రూప్‌లు/సబ్జెక్టులు, తమకు నచ్చే కోర్సు విషయంలో విద్యార్థి ముందుగా ఒక స్పష్టమైన అవగాహనకు రావాలి. ఉదాహరణకు ఎంపీసీ గ్రూప్(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) నచ్చిన విద్యార్థి.. ఆ కోర్సు పూర్తిచేసిన తర్వాత లభించే ఉన్నత విద్యావకాశాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్, డెంటల్, ఫార్మసీ వంటి కోర్సులతోపాటు తాము ఇంటర్మీడియెట్‌లో చదివిన కోర్సుకు సరిపడే ఇతర బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఏంటో తెలుసుకోవాలి.

 ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీలో కూడా ఇంటర్మీడియెట్ గ్రూప్ సబ్జెక్ట్‌లకు అనుసంధానంగా ఉండే పలు అరుదైన కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. వాటి గురించి తెలుసుకుని.. ఆ తర్వాత పీజీ స్థాయిలో సంబంధిత స్పెషలైజేషన్లు, తద్వారా లభించే ఉద్యోగావకాశాల గురించి సమాచారం సేకరించాలి. వాస్తవానికి ఇంటర్మీడియెట్ స్థాయిలో విద్యార్థికి కెరీర్ ఎంపిక విషయంలో అవగాహన తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ దశలో తల్లిదండ్రులు, లెక్చరర్లు సహకారం అందించాలి. పూర్తిస్థాయి అవగాహనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించే మార్గనిర్దేశనాలు విద్యార్థికి కెరీర్ పరంగా ఎంతో ఉపయోగపడతాయి. ఉన్నత భవిష్యత్తుకు పునాది వేస్తాయి.

 కాలేజీ నుంచి జాబ్ దశకు:
 మూడు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సు.. రెండేళ్ల పీజీ పూర్తిచేశాక.. విద్యార్థి ముందున్న ఏకైక లక్ష్యం.. మంచి ఉద్యోగం సంపాదించడం. అందుకోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, పోటీ పరీక్షలు, కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలకు రెజ్యూమె పంపించడం, రాత పరీక్షలకు హాజరవడం, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం.. ఇలా అన్ని మార్గాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం సాగించాలి. తాము బ్యాచిలర్, పీజీ స్థాయిల్లో చదివిన కోర్సు, సొంతం చేసుకున్న స్కిల్స్ ఆధారంగా సాగితే చక్కటి కెరీర్‌కు మార్గం సుగమం అవుతుంది.

 ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏదో ఒక ఉద్యోగం లభించడమే అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంతో.. తాము చదివిన కోర్సుతో సంబంధం లేకుండా దొరికిన ఉద్యోగంలో చేరుతున్నవారు కోకొల్లలు. ఇలాంటి విద్యార్థులు కొంతకాలం గడిచాక.. అందులో ఇమడలేక, తిరిగి తమకు ఆసక్తిగల రంగంలోకి ప్రవేశించలేక తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇది కెరీర్ పరంగా ఎంతో నష్టం కలిగించే అంశం. కాబట్టి ఈ విషయంలో ముందుగానే కసరత్తు చేయాలి. ప్రొఫెసర్లు, ఇతర సీనియర్ల సలహాలు తీసుకోవాలి. నాలుగేళ్లపాటు అకడమిక్‌గా ఒక విద్యార్థి నైపుణ్యాలను పరిశీలించే ప్రొఫెసర్లు కెరీర్ పరంగానూ చక్కటి మార్గ నిర్దేశకులే.


 కెరీర్ ప్లానింగ్ దశలు:
 వాస్తవానికి కెరీర్ ప్లానింగ్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆసక్తులు, నైపుణ్యాలు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ.. పటిష్ట ప్రణాళిక రూపొందించుకుంటూ అమలు చేస్తుండాలి. కెరీర్ ప్లానింగ్‌లో ఎన్నో అంశాలు, దశలు ముడిపడి ఉంటాయి. అయితే, స్థూలంగా చూసినప్పుడు కెరీర్ ప్లానింగ్‌ను ఆరు దశలుగా పేర్కొనవచ్చు. అవి..

 మొదటి దశ: స్వీయ విశ్లేషణ..
 కెరీర్ ప్లానింగ్‌లో మొట్టమొదటి దశ స్వీయ విశ్లేషణ సాగించడం. ఈ విశ్లేషణలో పరిగణించాల్సిన అంశాలు.. సొంత నైపుణ్యాలు, సబ్జెక్ట్ పరిజ్ఞానం, వ్యక్తిగత ప్రవర్తన శైలి, మీకున్న విశ్వాసం స్థాయి, వ్యక్తిగత పరిమితులు, ఆసక్తులు, వాస్తవాలు, బాధ్యతలు.

 రెండో దశ: సెల్ఫ్ డెవలప్‌మెంట్..
 మొదటి దశలో స్వీయ విశ్లేషణ పకడ్బందీగా పూర్తిచేసి తమ గురించి తాము ఒక అవగాహనకు వచ్చాక.. వ్యక్తిగత లోటుపాట్లు, బలాలు-బలహీనతలపై స్పష్టత ఏర్పడుతుంది. వీటిద్వారా సెల్ఫ్ డెవలప్‌మెంట్‌కు మార్గం వేసుకునే దశ ఇది. తమకున్న నైపుణ్యాలు, ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు గుర్తించాలి. ఉదాహరణకు ఒక విద్యార్థికి సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న సరికొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండొచ్చు. ఇలాంటి వాటిని మెరుగుపరచుకోవడం కోసం ఈ సెల్ఫ్ డెవలప్‌మెంట్ దశ ఉపయోగపడుతుంది.

 మూడో దశ: పరిశోధన..
 కెరీర్ ప్లానింగ్ పరంగా ఈ దశ కొంత కీలకం. ఇప్పటికే మొదటి రెండు దశల ద్వారా ఆసక్తులు, ఆలోచనలపై అవగాహనకు వచ్చి ఉంటారు. అయితే, వాటిలో ఏవి ఉన్నత కెరీర్‌కు ఉపయోగపడతాయో పరిశోధించాలి. తద్వారా తమ ఆసక్తులకు అనుగుణమైన వృత్తులను, కంపెనీలను గుర్తించాలి. సదరు కంపెనీలో తమ ఆసక్తులకు అనుగుణంగా పనిచేయగల వాతావరణం ఉందో, లేదో గుర్తించాలి. ఆ కంపెనీ లేదా రంగం భవిష్యత్తును అంచనా వేయాలి.

 నాలుగో దశ: కార్యాచరణ ప్రణాళిక
 మూడో దశలో చేసిన పరిశోధన, పరిశీలన ఫలితంగా నచ్చిన రంగాన్ని, పరిశ్రమను గుర్తించిన తర్వాత.. ఆ రంగంలో కెరీర్‌ను అన్వేషించడానికి కార్యాచరణకు ఉపక్రమించాల్సిన దశ ఇది. ఈ క్రమంలో ముందుగా చిన్నపాటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. అవే భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు అధిగమించేందుకు ఉపయోగపడతాయి. ఇదే క్రమంలో గుర్తుంచుకోవాల్సిన అంశం.. ఈ కార్యాచరణ భారీగా ఉండకుండా.. వాస్తవ పరిస్థితులకు, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఉండేలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ క్రమంలో.. ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. దీన్ని కెరీర్‌కు పునాదిగా భావించాలి. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ముందుగా మీకు అభిరుచి ఉన్న అంశానికి సంబంధించి చిన్నపాటి ఇంటర్న్‌షిప్ లేదా పార్ట్‌టైం జాబ్ సంపాదించాలి.


 అయిదో దశ: లక్ష్యాల రూపకల్పన
 ఇప్పటికే మొదటి నాలుగు దశల ఆధారంగా మీరు అన్వేషించిన ఉద్యోగాలు, అవకాశాలను సమీక్షించుకోవాలి. ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? అని పరిశీలించాలి. దీనిద్వారా స్వల్ప కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఇలా.. స్వీయ విశ్లేషణ ద్వారా ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలను గుర్తించి, ఆ దిశగా కృషి చేయాలి.

 ఆరో దశ: కార్యక్షేత్రంలో ప్రవేశం
 పకడ్బందీ కెరీర్ ప్లానింగ్ క్రమంలో దీన్ని చివరి దశగా పేర్కొ నవచ్చు. ఇప్పటికే మీరు ఏర్పరచుకున్న లక్ష్యాల దిశగా.. కార్యక్షేత్రంలో ప్రవేశించడానికి ఉపక్రమించాల్సిన దశ ఇది. ప్రవేశించాక కూడా సంబంధిత విభాగంలో నిరంతరం లక్ష్యాలు ఏర్పరచుకుని వాటి ప్రగతిని సమీక్షించుకోవాలి.
 ఇలా పాఠశాల దశ నుంచే పకడ్బందీ ప్లానింగ్‌తో అడుగులు వేస్తే.. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. అభిరుచులు, ఆసక్తి, సరితూగే కోర్సులను పరిగణనలోకి తీసుకుంటూ.. దీర్ఘకాలిక ప్రణాళికతో , ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

 ప్రధానం.. అభిరుచే
 ప్రస్తుతం విద్యార్థులకు పదో తరగతి నుంచే పలు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అభిరుచే ఆధారంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకుసాగొచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్ ప్లానింగ్ అనేది ఎంతో ముఖ్యమైన అంశంగా మారింది. ఈ కెరీర్ ప్లానింగ్‌కు రూపకల్పన చేసుకునే ప్రక్రియలో భాగంగా అవసరమైతే సైకాలజిస్ట్‌లు, కెరీర్ కౌన్సెలర్లను సంప్రదించడానికి కూడా సందేహించకూడదు. చివరికి ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్న తర్వాత అకడమిక్‌గా, కెరీర్ పరంగా ఆ రంగంలో గల అవకాశాలను, వ్యక్తిగత అంశాలను బేరీజు వేసుకుంటూ.. కెరీర్ ప్రణాళిక రూపొందించుకుంటే నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సులభం.
 - ఎం.రామకృష్ణ, మేనేజింగ్ డెరైక్టర్,
 జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్

విద్యార్థుల భావి జీవితానికి ‘నవోదయ'

గ్రామీణ విద్యార్థులకు కూడా మెరుగైన విద్యనందించి, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. మన దేశంలో మొత్తం 595 జవహర్ నవోదయ విద్యాలయాలున్నాయి. మన రాష్ర్టంలో ఉన్న 24 నవోదయా పాఠశాలల్లో 1920 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో విజయం సాధించి ప్రవేశం పొందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు విద్య, వసతి, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేన్‌వీఎస్‌టీ)-2014 పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్‌పై ఫోకస్...

 జాతీయ విద్యా విధానం(1986) ప్రకారం గ్రామీణ ప్రాంత విద్యార్థులను సైతం పట్టణ ప్రాంత విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. నేడు తల్లిదండ్రులకు విద్య పెను భారంగా మారింది. నర్సరీలు, ప్లేస్కూల్స్‌లో ఫీజులు వేలల్లోనే. ఇంటర్నేషనల్ స్కూల్స్‌ల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు వరమని చెప్పొచ్చు. వీటిల్లో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల విధానంలో బాలబాలికలకు విద్యనందిస్తారు. ఈ నవోదయ విద్యాలయాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా స్వత ంత్ర ప్రతిపత్తి కలిగిన జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఉంది. జిల్లాకు ఒకటి చొప్పున, కొన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా మరికొన్ని నవోదయ విద్యాలయాలున్నాయి.

 ప్రవేశం ఇలా:
 నవోదయ విద్యాలయాల్లో మొదట ఆరో తరగతిలోకి మాత్రమే ప్రవేశం లభిస్తోంది. అది కూడా ఒక్కో విద్యాలయానికి 80 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి వరకు విద్యనభ్యసించొచ్చు. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థి మాతృభాషలో బోధన చేస్తారు. పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకే షన్ (సీబీఎస్‌ఈ) సిలబస్‌తో రాయాలి.

 అర్హత:
 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. ఏ జిల్లాలో నవోదయ స్కూల్ ఉందో.. ఆ జిల్లాకు మాత్రమే అర్హులవుతారు.
 మే 1, 2001 కంటే ముందు, ఏప్రిల్ 30, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు.

 సీట్లు:
 ప్రతి జిల్లాలో కనీసం 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు.
 గ్రామీణ కోటాలో, అర్బన్ కోటాలో సీట్లు పొందాలంటే సంబంధిన ప్రాంతంలో ఉన్న పాఠశాలలో మూడు, నాలుగు, ఐదు తరగతులు చదివుండాలి.
 రిజర్వేషన్స్: ప్రతి నవోదయ పాఠశాలలో మొత్తం సీట్లలో 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు. 1/3 వంతు సీట్లు బాలికలకు ఉంటాయి. మూడు శాతం సీట్లను శారీరక వికలాంగులతో భర్తీ చేస్తారు.

 పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధి ఉండే పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థి ఏ మీడియంలో ఐదో తరగతి చదువుతున్నాడో అదే మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది.

 విభాగం    ప్రశ్నలు    మార్కులు    సమయం
 మెంటల్ ఎబిలిటీ టెస్ట్    50    50    60 ని.
 అర్థమెటిక్ టెస్ట్     25    25    30 ని.
 లాంగ్వేజ్ టెస్ట్     25    25    30 ని.
 మొత్తం    100    100    2 గం.

 దరఖాస్తు ఇలా: దరఖాస్తుతోపాటు ప్రాస్పెక్టస్‌ను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్,జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ నుంచి పొందొచ్చు. లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2013
 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 8, 2014
 వివరాలకు: www.navodaya.nic.in


 అన్నీ ఉచితమే
 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు కూడా ఉచితంగా అందిస్తారు. కో ఎడ్యుకేషన్ విధానంలో, పూర్తిగా గురుకుల పద్ధతిలో బోధన ఉంటుంది. బాలబాలికలకు వేరు వేరుగా హాస్టల్ వసతి ఉంటుంది. ఇక్కడి నవోదయా లో మొత్తం 45 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. 12వ తరగతి వరకు ఉచితంగా విద్య అభ్యసించవచ్చు.

గ్రామీణాభివృద్ధి కోర్సులు.. అవకాశాలు ఘనం!!

గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో ప్రపంచం పరుగులు తీస్తున్న తరుణం.. బహుళ జాతి సంస్థలు అన్ని దేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తున్న సమయం.. విద్యార్థులు లక్షల్లో వేతనాలు అందించే కోర్సులవైపు దృష్టిసారిస్తున్న సందర్భం.. అయితే విద్యార్థులు కొంత దూరదృష్టితో ఆలోచిస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభం చేకూర్చే కోర్సులు.. గ్రామీణాభివృద్ధి కోర్సులు అంటున్నారు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెల్ ప్రాజెక్ట్ డెరైక్టర్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ హెడ్ డాక్టర్ ఎస్.ఎం.ఇలియాస్. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి దిశగా కృషిచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. గ్రామీణాభివృద్ధి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు గోల్డెన్ కెరీర్ ఖాయం అంటున్న ఇలియాస్‌తో  ప్రత్యేక ఇంటర్వ్యూ..


 గ్రామీణాభివృద్ధి తప్పనిసరి
 వందకోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశంలో.. అత్యధిక శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలే. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో ఎన్ని బహుళ జాతి సంస్థలు అడుగుపెట్టినా.. దేశం ప్రగతి పథంలో సాగాలంటే ముందుగా గ్రామీణాభివృద్ధి జరగాలి. గ్రామీణప్రాంత ప్రజలు ఈ ప్రపంచీకరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. పల్లె ప్రజలకు ప్రస్తుత పరిస్థితులపై అవగాహన, అందుకు తగినవిధంగా స్వయం సాధికారత సాధించే ఆత్మవిశ్వాసం నెలకొల్పాలి. ఇది సాధ్యం కావాలంటే.. సరైన మార్గనిర్దేశనం అవసరం. అలా మార్గనిర్దేశనం చేసే కోర్సులే.. గ్రామీణాభివృద్ధి కోర్సులు. ఆ దిశగా.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులకు రూపకల్పన చేసింది.


 ప్రస్తుతం మూడు కోర్సులు
 ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి రెసిడెన్షియల్ విధానంలో పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) కోర్సు, దూర విద్యా విధానంలో పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాం. ప్రతి కోర్సు కాల వ్యవధి  సంవత్సరం. రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు కోర్సు పూర్తయ్యేవరకూ తప్పనిసరిగా ఎన్‌ఐఆర్‌డీ క్యాంపస్‌లోని హాస్టల్‌లోనే నివసించాలి. ఇప్పటికే ఆయా ఉద్యోగాలు చేస్తూ.. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి కలిసొచ్చే కోర్సులు.. దూర విద్యా విధానంలో అందిస్తున్న రెండు కోర్సులు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పరిధిలోని పలు గ్రామీణాభివృద్ధి పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉన్నతికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.


 వినూత్నంగా పీజీడీఆర్‌డీఎం
 ఎన్‌ఐఆర్‌డీ రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సు. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత ఏదైనా విభాగంలో డిగ్రీ. బోధన, కరిక్యులం పూర్తి వినూత్నంగా ఉంటుంది. ఈ కోర్సు కాల వ్యవధి ఏడాది. బ్యాచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటారు. విద్యార్థులను నేరుగా క్లాస్‌రూంలో కూర్చోపెట్టకుండా.. ముందుగా అయిదు రోజులు ఫీల్డ్ విజిట్ పేరిట నిర్దిష్ట గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తాం. అయిదు రోజుల తర్వాత విద్యార్థులు ఫీల్డ్ విజిట్‌లో తాము తెలుసుకున్న సమస్యలు, ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచే క్లాస్ రూం బోధన మొదలవుతుంది. అదేవిధంగా ఏడాది వ్యవధిగల కోర్సులో 45రోజులపాటు ఫీల్డ్ విజిట్ పేరుతో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్‌వర్క్ కూడా తప్పనిసరి. ఇలాంటి బోధన ఫలితంగా కోర్సు పూర్తిచేసుకునే సమయానికి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణత లభిస్తుంది.


 ఎన్‌ఐఆర్‌డీలో ప్రవేశం పొందాలంటే
 ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి స్థాయిలో అందిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంకు ప్రతి ఏటా డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తర్వాత రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తాం. ఇక.. దూర విద్యా విధానంలో అందించే రెండు కోర్సుల్లో ఒకటైన పీజీ డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తాం. మరో కోర్సు పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు ఎన్‌ఐఆర్‌డీనే నేరుగా ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తుంది. సాధారణంగా వీటికి నోటిఫికేషన్ అక్టోబర్ లేదా నవంబర్‌లో వెలువడుతుంది.


 ఎంఎన్‌సీలకు దీటుగా ప్లేస్‌మెంట్స్
 కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు క్యాంపస్‌లోని ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. వీటిలో విద్యార్థులకు అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో..  పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఈ కోర్సు విద్యార్థులను నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలో 2012-13 వరకు ఈ కోర్సు సర్టిఫికెట్లు అందుకున్న అయిదు బ్యాచ్‌ల 250 మంది విద్యార్థుల్లో.. ప్రతి ఒక్కరికి ప్లేస్‌మెంట్స్ లభించాయి. ప్రారంభంలో కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనాలు అందుకున్న విద్యార్థులు కూడా ఉన్నారంటేనే ఈ కోర్సుకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.


 ఆదరణకు కొదవ లేదు
 పీజీడీఆర్‌డీఎం కోర్సు విషయంలో విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. బీటెక్, ఎంబీఏ, లా తదితర ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తిచేసుకుని పలు ఎంఎన్‌సీల్లో ఉద్యోగాలు వదిలేసి.. ఈ కోర్సులో చేరిన విద్యార్థులుండటమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా కేవలం 50 మందికి మాత్రమే ప్రవేశం కల్పించే ఈ కోర్సులో చేరడానికి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే  గ్రామీణాభివృద్ధి, సంబంధిత రంగంలో అకడెమిక్ కోణంలో ఆలోచించే విద్యార్థులకు సోషియాలజీ, సోషల్‌వర్క్, ఆంత్రోపాలజీలే వేదికలుగా మారాయి. వాస్తవానికి అవి కూడా రూరల్ డెవలప్‌మెంట్ సంబంధితమైనప్పటికీ వాటిలో పూర్తిస్థాయిలో అవగాహన లభించడం సాధ్యం కాదు. కాబట్టి రూరల్ డెవలప్‌మెంట్ కోర్సుల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తిస్థాయిలో ఈ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలుసుకుని వాటిలో ప్రవేశించడం మంచిది.


 యూనివర్సిటీలు కూడా చొరవ చూపాలి
 గ్రామీణాభివృద్ధి కోర్సుల రూపకల్పనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు, ఇతర గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు కూడా చొరవ చూపాలి. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి దిశగా ఇటీవల  ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ కోర్సుల రూపకల్పన చేస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ దిశగా యూనివర్సిటీలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే శ్రీకాకుళంలోని డాక్టర్‌॥బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ.. ఎన్‌ఐఆర్‌డీ కొలాబరేషన్‌తో కోర్సును ప్రారంభించేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభించింది. అదే విధంగా ఒడిశాలోని బరంపూర్ యూనివర్సిటీ కూడా సంప్రదించింది. ఇదే తరహాలో ఇతర యూనివర్సిటీలు కూడా అడుగులు వేస్తే బాగుంటుంది. ఎన్‌ఐఆర్‌డీ అనేది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ. అన్ని ప్రాంతాల్లో క్యాంపస్‌లు, కోర్సులు రూపకల్పన చేయడం క్లిష్టమైన ప్రక్రియ. అయితే పరస్పర సహకారంతో కోర్సులు అందిస్తామనే ఇన్‌స్టిట్యూట్‌లకు మేం తప్పక సహకరిస్తాం.


 మరో విశిష్టత.. ఎన్‌ఐటీ ఇటానగర్‌లో ఎంటెక్
 అకడెమిక్ పరంగా ఎన్‌ఐఆర్‌డీ చేపట్టిన మరో ముఖ్య కార్యక్రమం.. ఎన్‌ఐటీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)-ఇటానగర్(అరుణాచల్ ప్రదేశ్)తో ఒప్పం దం కుదుర్చుకుని ఎంటెక్(అప్రాప్రియేట్ టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాక్టీసెస్) కోర్సును రూపొందించాం. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సు మొదలైంది. టెక్నాలజీని రూరల్ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేస్తూ ఇలాం టి కోర్సును ప్రారంభించడం దేశంలోనే తొలిసారి. ఇలా ఎన్‌ఐఆర్‌డీ వీలైనంత మేర అన్ని విభాగాల్లో రూరల్ డెవలప్‌మెంట్‌ను అకడెమిక్ స్థాయిలోనే విస్తృతం చేసి తద్వారా భవిష్యత్తులో దేశ ప్రగతికి చేయూతనందించేందుకు కృషి చేస్తోంది.


 షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సుల దిశగా ఆలోచన
 ఎన్‌ఐఆర్‌డీ దీర్ఘకాలిక కోర్సులతోపాటు స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించే దిశగానూ ఆలోచిస్తోంది. ముందుగా మూడు నెలల వ్యవధిలో పావర్టీ ఎరాడికేషన్ మేనేజ్‌మెంట్, జీఐఎస్-ఐసీటీ అప్లికేషన్ కోర్సుల ప్రారంభానికి చర్చలు జరుగుతున్నాయి.


 ఉన్నత విద్యావకాశాలు
 ఎన్‌ఐఆర్‌డీ అందిస్తున్న కోర్సులన్నీ పీజీ డిప్లొమా కోర్సులే. కాబట్టి ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేయడమే మార్గం. ఇక్కడ పేర్కొన్నట్లుగానే ఎన్‌ఐఆర్‌డీలో కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించి.. దూర విద్యా విధానంలో ఎంఏ, ఎం.ఫిల్ కోర్సులు అభ్యసిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.


 భవిష్యత్తులో లక్షల్లో అవకాశాలు
 రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తు బంగారుమయం అనడంలో సందేహం లేదు. కేవలం ప్రభుత్వ రంగంలోనే లక్షల్లో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో 15.75 లక్షల స్వయం సహాయక బృందాలను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒక్క అంశాన్నే పరిగణనలోకి తీసుకుంటే అంతమందికి తగిన మార్గ నిర్దేశనం చేయడానికి రూరల్ డెవలప్‌మెంట్‌లో సుశిక్షితులైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమ అమలుకు, సోషల్ అడిట్ నిర్వహణ తదితర అంశాలకు కూడా రూరల్ డెవలప్‌మెంట్ ఉత్తీర్ణులే సరితూగుతారు. ఇక ప్రైవేట్ రంగంలో ఇటీవలే ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసింది. దీంతో అన్ని కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి. ఇందుకు కూడా సుశిక్షితులైన రూరల్ డెవలప్‌మెంట్ అభ్యర్థులే సరితూగుతారు.


 ఔత్సాహిక విద్యార్థులకు సలహా
 మిగతా కోర్సులతో పోల్చితే రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు వైవిధ్యభరితం. దీనికనుగుణంగా ఔత్సాహిక విద్యార్థులకు స్వయంగా కొన్ని లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి సంస్కృతి, నేపథ్యం ఉన్న ప్రజలతోనైనా మమేకమవగల మనస్తత్వం, నిజమైన ఆసక్తి, గ్రామీణ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటేనే ఇందులో రాణించగలరు. కేవలం పైన పేర్కొన్న ప్లేస్‌మెంట్ రికార్డ్స్, వేతనాలు ఆధారంగా అడుగుపెడితే యాంత్రికంగా ఉంటుంది. భవిష్యత్తులో రాణించడం కష్టం. కాబట్టి ఈ కోర్సులు సహనం, ఓర్పు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్న వారికి ఎంతో అనుకూలం.


 రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్- ఐఆర్‌ఎం క్యాంపస్ (జైపూర్)
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్- ఆనంద్ (గుజరాత్)
 యూనివర్సిటీ ఆఫ్ కల్యాణి- పశ్చిమబెంగాల్
 జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్- భువనేశ్వర్, జార్ఖండ్
 రామకృష్ణ మిషన్ విద్యాలయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
 అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్- తమిళనాడు
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- గుంటూరు
 భారతీ విద్యాపీఠ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్- మహారాష్ట్ర

యోగా కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు.

బీటెక్ (ఈఈఈ) తర్వాత ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
 -రమేశ్, విజయనగరం.
 బీటెక్ (ఈఈఈ) తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షకు హాజరు కావచ్చు. తద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు సహా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా.. ఎంఈ/ ఎంటెక్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఎంట్రీలెవల్ రిక్రూట్‌మెంట్ కోసం కూడా గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

 బార్క్, భారత అణుశక్తి శాఖలోని కొన్ని విభాగాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లు.. గేట్ స్కోర్ ఆధారంగానే ఎంట్రీ లెవల్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో పీజీఈసెట్ ద్వారా ఎంటెక్/ఎంఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. మరో అవకాశం యూపీఎస్సీ జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్). ఈ పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-ఏ, బీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు.
 వివరాలకు: www.upsc.gov.in

 స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి?    -సునీల, కర్నూలు.
 మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ కోర్సులో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్, ఆటిజం, ఇంపెయిర్‌మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 ఈ కోర్సులను పూర్తి చేస్తే దేశ, విదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా; రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీ స్కూళ్లు, వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్ (వెబ్‌సైట్: www.nimhindia.org); స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్ -సికింద్రాబాద్ (వెబ్‌సైట్: www.sweekaar.org); ఆంధ్రా వర్సిటీ-విశాఖపట్నం (వెబ్‌సైట్: www.andhrauniversity. edu.in); శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం-తిరుపతి (www.spmvv.ac.in); కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-ఆంధ్ర మహిళా సభ-హైదరాబాద్ (www.andhramahilasabha. org.in)లు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తున్నాయి.

 యోగాకు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -సనత్ కుమార్, రావులపాలెం.
 భారతీయ సంస్కృతిలో యోగా ఒక భాగం. శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగాభ్యాసాన్ని మించిన వైద్యం లేదన్న విషయం ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో యోగా ప్రాక్టీస్ చేసేవారు పెరిగారు. ఇది ఒక కెరీర్‌గా మారింది. దీంతో యోగా ట్రైనర్లకు డిమాండ్ ఏర్పడింది. వృత్తి పట్ల నిబద్ధత, సహనం, ఆరోగ్యం కోసం వచ్చే వారి పట్ల వ్యవహరించే తీరుపైనే కెరీర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక మాదిరి పట్టణాలు, పెద్ద నగరాల్లో యోగా ట్రైనింగ్ సెంటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటువంటి ప్రదేశాల్లో ప్రారంభంలో ట్రైనర్లు నెలకు రూ.20,000 నుంచి రూ. 25,000 వరకు ఆదాయం పొందుతున్నారు. మిడిల్ లెవెల్ ప్రొఫెషనల్స్ నెలకు రూ.40 వేల నుంచి రూ. 50 వేలు, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం లక్ష రూపాయలు ఆర్జిస్తున్నారు.

 యోగా కోర్సులను అందిస్తున్న సంస్థలు:
 శ్వాస (SVYASA) యూనివర్సిటీ-బెంగళూరు. ఈ యూనివర్సిటీ యోగాకు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులతోపాటు డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులను కూడా అందిస్తుంది
 వివరాలకు: www.svyasa.org
 మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.yogamdniy.nic.in
 యోగా లైఫ్- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.yogalife.org
 శివానంద యోగ వేదాంత సెంటర్స్.
 వివరాలకు: www.sivananda.org
 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి- న్యూఢిల్లీ.
 వివరాలకు: www.ccryn.org




 ఆక్యుపేషనల్ థెరపి కోర్సు వివరాలను తెలపండి?  
 -పద్మావతి, అనంతపురం.
 మానసిక లేదా శారీరక వైకల్యాలతో బాధపడే వారు తమ దైనందిక కార్యకలాపాలను ఎవరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా నిర్వహించుకునేలా దోహదం చేసేది ఆక్యుపేషనల్ థెరపి. ఇందుకోసం చుట్టూ ఉన్న వాతావరణం, శక్తి సామర్థ్యాలు, తదితర అంశాలను ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు పరిగణనలోకి తీసుకుంటారు.

 ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-తమిళనాడు
 వివరాలకు: www.srmuniv.ac.in
 మణిపాల్ యూనివర్సిటీ-కర్ణాటక
 వివరాలకు: www.manipal.edu
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్-ఒడిశా
 వివరాలకు: http://nirtar.nic.in

వ్యవసాయ వర్సిటీల్లో అధ్యాపక వృత్తికి ఏఎస్‌ఆర్‌బీ నెట్

ఇన్ఫోకార్నర్

 యూజీసీ-నెట్, స్లెట్ (స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్) తరహాలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిని ప్రారంభించాలనుకునే అభ్యర్థుల కోసం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) విభాగం ఏఎస్‌ఆర్‌బీ-నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను నిర్వహిస్తుంది. 2013 సంవత్సరానికి ఏఎస్‌ఆర్‌బీ-నెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల్లో కలిపి మొత్తం 55 విభాగాల్లో ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌ను నిర్వహిస్తారు.

 పరీక్షా విధానం:
 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా మాస్టర్ డిగ్రీ స్థాయిలో ప్రశ్నలను అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.

 ఐదు అవకాశాలు:
 ప్రతి అభ్యర్థికి ఏఎస్‌ఆర్‌బీ-నెట్ రాసేందుకు ఐదు అవకాశాలు (2012 ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌కు ముందు హాజరైన సందర్భాలను మినహాయించి) ఉంటాయి . నిర్దేశిత అభ్యర్థులకు నెట్ హాజరు విషయంలో పరిమితి లేదు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 33 కేంద్రాల్లో ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌ను నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం ఉంది.

 అర్హత మార్కులు:
 నెట్/స్లెట్ మాదిరిగానే ఇందులో కూడా నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే ఫైనల్ రిజల్ట్స్ ప్రిపరేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో జనరల్/ఓబీసీ (క్రీమీలేయర్) అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి.

 ప్రయోజనాలు:
 రాష్ట్ర లేదా జాతీయస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ఏఎస్‌ఆర్‌బీ- నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో క్వాలిఫైయిడ్ అభ్యర్థులకు ఏఎస్‌ఆర్‌బీ సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తుంది. తద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీలలోని అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం సద రు అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది.

 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో ఆగస్ట్ 1, 2013 నాటికి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
 వయసు: 21 ఏళ్లు (ఆగస్ట్ 1, 2013 నాటికి). గరిష్ట వయోపరిమితి లేదు.
 ఫీజు:జనరల్ అభ్యర్థులు రూ. 1,000
 ఓబీసీ (నాన్-క్రీమీలేయర్) రూ. 500
 ఎస్సీ/ఎస్టీ/పీసీ     రూ. 250
 ఫీజును నిర్దేశించిన విధంగా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

 దరఖాస్తు విధానం:
 www.asrb.org.in/ www.icar.org.in/
 www.asrbexamonline.com/asrbreg/default.aspx వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తుల స్వీకర ణకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2013.
 రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 27, 2013.
 వెబ్‌సైట్: www.asrb.org.in / www.icar.org.in